సీఎం రేవంత్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరించాయి : ఎంపీ చామల

కలం, భువనగిరి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) తీవ్రంగా ఖండించారు. బెంగళూరులో జరిగిన ఒక కాంక్లేవ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ‘తెలంగాణ అభివృద్ధి-2047 రైజింగ్’ పై మాట్లాడిన మాటలను ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ రాజకీయ దుమారం లేపుతున్నాయని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తనను తాను హిట్లర్‌తో పోల్చుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. గతంలో రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో నగరంలోని ముంపు ప్రాంతాలను, ప్రజల కష్టాలను స్వయంగా చూశారని ఎంపీ చామల గుర్తు చేశారు.

హైదరాబాద్ నగరంలో నాళాలు, చెరువులు, కుంటలు కబ్జాకు గురికాకుండా కాపాడాలనే సంకల్పంతోనే సీఎం రేవంత్ రెడ్డికి ‘హైడ్రా’ ఆలోచన వచ్చిందన్నారు. హైదరాబాద్ నగర ప్రజల ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేయడానికే సీఎం ఈ వ్యవస్థను తీసుకొచ్చారని, ఇప్పటికే హైడ్రా ఏర్పాటై ఏడాది పూర్తయిందని తెలిపారు. బెంగళూరు కాంక్లేవ్‌లో సీఎం మాట్లాడిన వ్యాఖ్యలను వివరిస్తూ.. హిట్లర్ దగ్గరున్న ఒక సంస్థ ఏ విధంగా పూర్తి క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేసిందో, హైడ్రా కూడా అదే తరహాలో ఒక బలమైన, నిర్మాణాత్మక సంస్థగా పనిచేస్తుందని చెప్పే ప్రయత్నమే రేవంత్ రెడ్డి చేశారని ఎంపీ స్పష్టం చేశారు. అంతే తప్ప హిట్లర్‌ను పొగిడారనడం ప్రతిపక్షాల అజ్ఞానానికి నిదర్శనమన్నారు.

హైడ్రా (Hydraa) పరిధి కిందికి రెవెన్యూ, మున్సిపల్ వ్యవస్థలను తీసుకువచ్చి, కబ్జాదారుల గుండెల్లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిద్రపోతున్నారని కొనియాడారు. గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఏ విధంగా దోపిడీకి గురైందో ప్రజలు గమనించే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) గుర్తు చేశారు. ఇప్పుడు ఎలాగైనా సీఎంను బద్నాం చేయాలనే కుట్రతోనే బీఆర్ఎస్, బీజేపీలు చేతులు కలిపి కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. పర్యావరణాన్ని, మూసీ నదిని కబ్జాల నుంచి కాపాడుతూ, నగర ముంపును నివారించేందుకు హైడ్రా చేస్తున్న ప్రయత్నాల వల్ల ఇప్పటికే లక్షలాది మంది ప్రజలకు లబ్ధి చేకూరిందని చామల వివరించారు.

Read Also: దేశాన్ని విభ‌జించొద్దు.. రేవంత్‌కు కేంద్ర మంత్రి కౌంట‌ర్‌

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>