విరాట్‌తో వివాదంపై ట్రావిస్ హెడ్ క్లారిటీ..

కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026లో (IPL 2026) విరాట్ కోహ్లీతో (Virat Kohli) జరిగిన వివాదంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (Travis Head) ఎట్టకేలకు స్పందించాడు. తమ ఇద్దరి మధ్య పరిష్కరించుకోవాల్సినంత పెద్ద సమస్య ఏమీ లేదని స్పష్టం చేశాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ అనంతరం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్‌తో కరచాలనం చేయకుండా వెళ్లిపోయిన దృశ్యాలు కెమెరాలలో కనిపించాయి. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కోహ్లీ, హెడ్ అభిమానులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వాదనలకు దిగారు. కొంతకాలం తర్వాత ఈ వివాదంపై స్పందించిన ట్రావిస్ హెడ్.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పాడు. మైదానంలో పోటీ సమయంలో జరిగిన విషయాలను అంతకుమించి చూడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ఆటలో భాగంగా కొన్ని సందర్భాలు చోటుచేసుకుంటాయని, వాటిని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదని వివరించాడు. అయితే ఈ వివాదం తన కుటుంబంపై కూడా ప్రభావం చూపిందని హెడ్ వెల్లడించాడు. ముఖ్యంగా తన భార్య జెస్సికా డేవిస్‌కు సోషల్ మీడియాలో కొంతమంది నుంచి దూషణలు, అభ్యంతరకర సందేశాలు వచ్చినట్లు తెలిపాడు. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితులు ప్రొఫెషనల్ క్రీడాకారుల జీవితంలో భాగమని తాము భావిస్తామని చెప్పాడు.

జెస్సికా డేవిస్ పరిస్థితిని ఎంతో పరిపక్వంగా అర్థం చేసుకుని ఎదుర్కొందని హెడ్ ప్రశంసించాడు. అయితే సోషల్ మీడియాకు పెద్దగా అలవాటు లేని కుటుంబ సభ్యులపై ఇలాంటి ఘటనల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఇలాంటి విషయాలను అందరూ మర్చిపోతారని ట్రావిస్ హెడ్ తెలిపాడు. తన భార్య ఈ పరిస్థితిని హుందాగా ఎదుర్కొందని, కుటుంబ సభ్యులకు పరిస్థితిని వివరించడం మాత్రం కొంత కష్టంగా మారిందని చెప్పాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>