కలం, భువనగిరి: అమెరికాలో ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను తన ప్రాణాలకు తెగించి కాపాడి, అమరుడైన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లి గ్రామానికి చెందిన కోడూరు అనురూప్ రెడ్డి (23) కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరఫున మంజూరైన రూ.10 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును వారికి అందజేశారు. అమెరికాలోని లూసియానా టోరొడో పార్క్ వద్ద జరిగిన ఈ విషాద ఘటన తర్వాత అనురూప్ రెడ్డి భౌతికకాయాన్ని త్వరగా స్వదేశానికి రప్పించడంలో ఎంపీ చామల కీలక పాత్ర పోషించారు.
ఇండియన్ ఎంబసీ, తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ విభాగంతో నిరంతరం సంప్రదింపులు జరిపి, భౌతికకాయం జూన్ 9న హైదరాబాద్ చేరుకునేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రభుత్వ ప్రోటోకాల్ శాఖ ప్రత్యేక అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని విమానాశ్రయం నుండి నేరుగా కవాడిపల్లి గ్రామానికి తరలింపజేశారు. కేవలం 23 ఏళ్ల చిన్న వయసులోనే స్నేహితుల ప్రాణాలు కాపాడేందుకు అనురూప్ రెడ్డి (Anuroop Reddy) చూపిన ధైర్యం, మానవత్వం, చేసిన అత్యంత సాహసోపేత ప్రాణత్యాగాన్ని కొనియాడుతూ సీఎం ప్రత్యేకంగా అధికారిక ప్రశంసా పత్రాన్ని పంపారు. అనురూప్ వీరత్వం యావత్ తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకమని సీఎం తన సందేశంలో కొనియాడారు.
ఈ ప్రశంసా పత్రాన్ని ఎంపీ చామల (MP Chamala) బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనురూప్ అకాల మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, ఎంత సొమ్ము ఇచ్చినా వారి శోకాన్ని తీర్చలేమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ వీర యువకుడి త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించిందని, భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎంపీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొని అనురూప్ రెడ్డికి ఘన నివాళులర్పించారు.
Read Also: అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ వాళ్లకు చుక్కలు చూపిస్తాం: హరీశ్ రావు
Follow Us On : WhatsApp

