కలం, స్పోర్ట్స్ : ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక అవుతానని ఆశించిన యువ ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మకు(Ashok Sharma) చివరి క్షణంలో నిరాశ ఎదురైంది. బీసీసీఐ పాస్‌పోర్ట్ తీసుకోవడంతో పాటు వీసా కూడా మంజూరవడంతో జట్టులో చోటు ఖాయమని భావించినా అవకాశం దక్కలేదు. అయితే నిరాశ చెందకుండా తన ఆటపై దృష్టి పెట్టిన అశోక్‌కు ఇప్పుడు అదృష్టం తలుపు తట్టింది.
జూలై 23 నుంచి జింబాబ్వేతో (Zimbabwe) జరిగే మూడు టీ20ల సిరీస్‌కు తొలిసారి టీమిండియా నుంచి పిలుపు అందుకున్నాడు. గత తొమ్మిది నెలల్లో అశోక్ శర్మ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రాజస్థాన్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 22 వికెట్లు తీసి 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ తరఫున తన వేగం, బౌలింగ్‌తో ఆకట్టుకుని ఇండియా-ఏ జట్టులో చోటు సంపాదించాడు.
గంటకు 154.2 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరిన అశోక్, భవిష్యత్తులో 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడమే లక్ష్యమని తెలిపాడు. అయితే కేవలం వేగం కోసం కాకుండా, మరింత మెరుగైన బౌలర్‌గా ఎదగడంపైనే తన దృష్టి ఉందని స్పష్టం చేశాడు. ఇండియా-ఏ జట్టుతో శ్రీలంక పర్యటనలో మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ నుంచి విలువైన సూచనలు అందుకున్నానని అశోక్ వెల్లడించాడు. అలాగే కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో భారత్ అరుణ్, రాజస్థాన్ రాయల్స్‌లో షేన్ బాండ్, గుజరాత్ టైటాన్స్‌లో ఆశిష్ నెహ్రా (Ashish Nehra) తన బౌలింగ్‌ను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారని చెప్పాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో ఉన్న సమయంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ ఇచ్చిన సలహా ఇప్పటికీ తనకు ప్రేరణగా నిలిచిందని అశోక్ (Ashok Sharma) తెలిపాడు. తన బలాన్ని మరింత బలంగా మార్చుకోవాలని, ఇతరులను అనుకరించకుండా సొంత శైలిలో రాణించాలని కమిన్స్ సూచించాడని వెల్లడించాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తనపై పూర్తి నమ్మకం ఉంచి ఒత్తిడి లేకుండా ఆడే స్వేచ్ఛ ఇచ్చాడని అశోక్ పేర్కొన్నాడు. టీమిండియాలో తన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని, అన్ని ఫార్మాట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం, ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో దేశం తరఫున ఆడటమే తన జీవిత లక్ష్యమని అశోక్ శర్మ వెల్లడించాడు.
Read Also: కదిలే రైలులో హనీమూన్.. నెట్టింట వీడియో వైరల్
Follow Us On : WhatsApp

