కలం, వెబ్ డెస్క్: కోల్‌కతా (Kolkata) లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలో ఒకటైన సురేంద్రనాథ్ కాలేజ్ (Surendranath College) భారీ వివాదంలో చిక్కుకుంది. స్టూడెంట్ యూనియన్ గదిలో రూ. కోటి విలువైన కరెన్సీ నోట్లు పూర్తిగా చెదలు పట్టిన స్థితిలో లభించడం తీవ్ర కలకలం రేపింది. 2 సూట్ కేసుల్లో రూ.100, రూ.500 నోట్ల కట్టలు చెదలు పట్టిన స్థితిలో లభ్యమయ్యాయి. చాలా కాలంగా ఆ గది మూసి ఉంచడం వల్ల నోట్ల కట్టలన్నింటికీ పూర్తిగా చెదలు పట్టి, ముక్కలు ముక్కలుగా మారిపోయాయి.
అయితే ఈ స్టూడెంట్ యూనియన్ గది అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం (TMCP) అధీనంలో ఉందని, గత ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి దాచిన అవినీతి సొమ్ము ఇదేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

