కలం, వెబ్ డెస్క్: జార్ఖండ్ (Jharkhand)లోని హజారీబాగ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ తన కుమారుడి ఆరోగ్యం కోసం కన్న కూతుర్ని నరబలి (human sacrifice) ఇచ్చింది. కుసుంభ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కుసుంభ గ్రామానికి చెందిన రేష్మి దేవికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దీంతో తల్లి రేష్మి అదే గ్రామంలో క్షుద్ర పూజలు చేసే శాంతి దేవి అనే మంత్రగత్తెను సంప్రదించింది. శ్రీరామనవమి సమయంలో దుర్గాష్టమి రోజున ఓ కన్యను నరబలి ఇస్తే ఆమె కుమారుడి అనారోగ్యం నయమవుతుందని, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని శాంతి దేవి నమ్మించింది.
నరబలి కోసం సొంత కుమార్తెను తీసుకురావాలని రేష్మిని శాంతి దేవి ప్రేరేపించింది. దీంతో మార్చి 24న రాత్రివేళ రేష్మి దేవి పూజలు చేయాలని చెప్పి తన 12 ఏళ్ల కూతుర్ని నమ్మించి ప్రియుడు భీమ్ రామ్‌ను వెంటబెట్టుకొని తాంత్రికురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ క్షుద్ర పూజలు చేశారు. అనంతరం కుమార్తె కాళ్లను తల్లి పట్టుకోగా, భీమ్ రామ్ ఆమె గొంతు నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేశారు. కాగా, శ్రీరామనవమి ఊరేగింపు తర్వాత తన కుమార్తె కనిపించలేదని రేష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. ఈ కాలంలో కూడా క్షుద్ర పూజలను నమ్మడం, సొంత కూతురినే తల్లి నరబలి ఇవ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

