కలం, వెబ్ డెస్క్ : కర్ణాటక కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి రోహిణీ సింధూరి (Rohini Sindhuri)కి చట్టపరమైన చిక్కులు మొదలయ్యాయి. ఆమె మైసూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో జరిగినట్లుగా చెబుతున్న అక్రమాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆమెపై క్రిమినల్ విచారణకు రంగం సిద్ధమైంది.
2021లో రోహిణీ సింధూరి (Rohini Sindhuri) మైసూరు డీసీగా ఉన్న సమయంలో సంచుల (క్లాత్ బ్యాగ్స్) కొనుగోలు ప్రక్రియలో భారీ అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. కేవలం 13 రూపాయల విలువ చేసే ఒక్కో సంచిని 52 రూపాయల చొప్పున కొనుగోలు చేశారని, ఈ వ్యవహారంలో నిబంధనలను తుంగలో తొక్కడం వల్ల ప్రభుత్వ ఖజానాకు 7,65,15,816 రూపాయల మేర నష్టం వాటిల్లిందని రవిచంద్రేగౌడ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
ఈ కుంభకోణంపై 2021 అక్టోబరు 13నే మైసూరులోని అవినీతి నిరోధక శాఖలో ఫిర్యాదు అందినప్పటికీ, విచారణలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టు జోక్యం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

