కలం, వెబ్ డెస్క్: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ (Moinabad drugs party) కేసు వెనుక ఉన్న మూలాలపై రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్(DCP Yogesh Gautam) నేతృత్వంలో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు, డ్రగ్స్ సప్లయర్‌లతో అతని సంబంధాలపై ఆరా తీస్తున్నారు. తాజాగా ఈ కేసులో మరో విషయం తెలుగులోకి వచ్చింది. ఫామ్ హౌస్ లో పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసినట్లు అనుమానిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్ (Abhishek Singh)ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడినుంచి దిగుమతి చేసుకుంటున్నారు? ఎవరెవరికి పంపిస్తున్నారు? దీని వెనుక ముఠా ఏమైనా దాగివుందా? అనే అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అతని సెల్ ఫోన్ డేటా ఆధారంగా అధికారులు విచారణ చేస్తున్నారు. అభిషేక్ సింగ్ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి(Pilot Rohit Reddy) డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. రోహిత్ రెడ్డికి అభిషేక్ సింగ్ 24 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ కేసులో భాగంగా నిందితులు రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మల కస్టడీ పిటిషన్‌పై ఉప్పర్‌పల్లి కోర్టు(Upparpally Court) తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. శనివారం, ఆదివారం కోర్టుకు సెలవులు కావడంతో వాయిదా వేశారు. నిందితులను 10 రోజుల కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరారు. ఈ కేసులో దూకుడుగా వ్యవహరిస్తున్న సిట్.. రోహిత్ రెడ్డి దుబాయ్ సంబంధాలపైనా దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే నిందితుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని.. పుట్టా మహేష్ మినహా ఇతరుల వాంగ్మూలాలను నమోదు చేసింది. కస్టడీ లభిస్తే నిందితులను మరింత లోతుగా ప్రశ్నించే ఛాన్స్ ఉంది.

