కలం, నల్లగొండ బ్యూరో : అప్పుడు చేతిలో కాయ ఉంది కానీ.. జేబు నింపే ధర లేదు. ఇప్పుడేమో ఆశలు పెంచే ధర ఉంది కానీ.. అమ్ముకుందామంటే చెట్టుకు కాయ లేదు. ప్రకృతి కన్నుకుట్టిందో.. పాలకుల నిర్లక్ష్యం శాపమైందో కానీ, నిమ్మ రైతు బతుకు ‘పులుపు’ తిన్న చందంగా మారింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన నిమ్మ సాగుదారుడికి ఇప్పుడు సిరులు కురిపించే ధర కూడా వెక్కిరింతగానే కనిపిస్తోంది. ఇదీ నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని నిమ్మకాయ మార్కెట్ పరిస్థితి. తెలంగాణలోనే ఏకైక నిమ్మ మార్కెట్‌లో ఈ విచిత్ర పరిస్థితి రైతులకు ఆవేదన మిగుల్చుతోంది. ధర ఉంటే దిగుబడి ఉండదు.. దిగుబడి ఉంటే ధర ఉండదనే సామెత నిమ్మ రైతుల (Lemon Farmers) జీవితాల్లో అక్షరాలా నిజమవుతోంది. ప్రస్తుతం నిమ్మ మార్కెట్‌కు భారీగా దిగుబడులు తగ్గాయి. కానీ ధర మాత్రం రూ.2500 పలుకుతుండడం గమనార్హం. నల్లగొండ జిల్లా నకిరేకల్ నిమ్మ రైతాంగంపై ‘కలం’ స్పెషల్ స్టోరీ.
5వేల బస్తాలకు పడిపోయిన దిగుబడులు
నిమ్మకాయకు ప్రతి ఏటా మార్చి నుంచి జూన్ వరకు మంచి సీజన్. ఈ సీజన్‌లో నిమ్మ మార్కెట్‌కు నిత్యం 10వేల నుంచి 15వేల బస్తాల వరకు దిగుబడులు వస్తుంటాయి. కానీ ప్రస్తుతం నిమ్మ మార్కెట్‌కు 5వేల బస్తాలకు మించి రావడం లేదు. ధర మాత్రం ఒక్క బస్తా(23కేజీలు)కు రూ.2500 వరకు పలుకుతోంది. అయితే 10వేల బస్తాలకు పైగా మార్కెట్‌కు దిగుబడులు వచ్చిన సమయంలో బస్తాకు రూ.500 మించి పలకలేదు. ఇప్పుడు మంచి ధర ఉన్నా.. దిగుబడులు లేక నిమ్మ రైతాంగం తెల్లమొహం వేస్తోంది.
వేసవిలో ఫుల్ డిమాండ్..
సాధారణంగా నిమ్మకాయలకు వేసవిలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. నిమ్మకాయ రైతాంగానికి (Lemon Farmers) ఈ సీజన్ మంచి ఆయువు పట్టు అని చెప్పాలి. మిగతా సీజన్లలో దిగుబడి ఉన్నా.. లేకపోయినా ఫర్వాలేదు. కానీ ఈ సీజన్‌లో మాత్రం చెట్టుకు మూడు నుంచి నాలుగు బస్తాల దిగుబడి వస్తే.. అప్పుల్లోంచి బయటపడినట్టే. కానీ ఈ సంవత్సరం వర్షాలు, ఎర్రతెగుళ్లు సోకడంతో నిమ్మపంట దిగుబడి భారీగా తగ్గింది. నిమ్మచెట్లకు పూత రాలిపోవడంతో పాటు పిందె నిలవకపోవడంతో ఒక్క చెట్టుకు కనీసం బస్తా కాయలు దిగుబడి రాయడం గగనమైపోయింది. దీంతో నిమ్మ రైతాంగానికి ఫలం లేక ఫలితం దక్కడం లేదు.
ఉమ్మడి నల్లగొండలో 30వేల ఎకరాలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు 30వేల ఎకరాల్లో నిమ్మతోటలు సాగవుతున్నాయి. ప్రధానంగా నకిరేకల్ ప్రాంతంలో అత్యధికంగా నిమ్మ తోటలు ఉన్నాయి. అయితే గతంలో మరో 10వేల విస్తీర్ణంలో నిమ్మ సాగయ్యేది. కానీ నిమ్మమార్కెట్ లేక.. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక.. పాలకులు పట్టించుకోకపోవడంతో చాలామంది రైతాంగం నిమ్మ తోటలను పీకేసి ఇతర పంటలను సాగు చేశారు. నిమ్మ రైతుల సుదీర్ఘ పోరాటం తర్వాత నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్‌ను నామమాత్రంగా ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ధర నిర్ణయించడం అంతంత మాత్రమే. దళారులదే ఇష్టారాజ్యం. నకిరేకల్ నిమ్మ మార్కెట్ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, గుజరాత్, కలకత్తా, చెన్నై, యూపీ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు.

