కలం, నిజామాబాద్ బ్యూరో: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమంలో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. అక్కడ నూతనంగా నిర్మించిన కేశవ స్ఫూర్తి మందిరాన్ని మోహన్ భగవత్ ప్రారంభించడంతో పాటు, అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ (RSS chief) పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్య ఏర్పాట్లను పరిశీలించారు. పలు శాఖల జిల్లా అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ సభకు తరలివచ్చే వారి వాహనాల పార్కింగ్ క్రమపద్ధతిలో ఉండాలని, ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలని సూచించారు.
కేంద్ర బలగాలు ఇప్పటికే కందకుర్తిలోని స్ఫూర్తి మందిరం చుట్టుపక్కల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, కార్యక్రమానికి వచ్చేవారికి అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సభాస్థలి వద్ద అగ్నిమాపక వాహనం, వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ శ్రావణ్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్సై చంద్రమోహన్ పాల్గొన్నారు.

