కలం, వెబ్ డెస్క్: జపాన్ రాజధాని టోక్యోలో మంగళవారం ప్రారంభమైన జపాన్ ఓపెన్ (Japan Open) 2026 సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. రెండు సార్లు ఒలింపిక్ పతకం గెలిచిన స్టార్ ప్లేయర్ పీవీ సింధు (PV Sindhu) అదిరిపోయే విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. అయితే, గాయం తర్వాత కోర్టులోకి కంబ్యాక్ ఇచ్చిన స్టార్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టికి మాత్రం ఊహించని షాక్ తగిలింది. సాత్విక్‌కు పాత భుజం గాయం మళ్లీ తిరగబెట్టడంతో ఈ స్టార్ జోడీ టోర్నీ మధ్యలోనే వైదొలిగింది.
మే నెలలో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచిన సాత్విక్-చిరాగ్ జోడీ, ఆ తర్వాత జూన్‌లో ఇండోనేషియా ఓపెన్ మధ్యలో సాత్విక్ భుజం గాయం కారణంగా ఆటకు దూరమైంది. నెల రోజుల విరామం తర్వాత ఈ మ్యాచ్‌తోనే వారు మళ్లీ కోర్టులోకి అడుగుపెట్టారు. డెన్మార్క్‌కు చెందిన డేనియల్ లండ్‌గార్డ్, మాడ్స్ వెస్టర్గార్డ్లతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ జోడీ మొదటి గేమ్‌ను 19-21తో హోరాహోరీగా పోరాడి ఓడిపోయింది.
ఆ సమయంలోనే సాత్విక్‌కు భుజం నొప్పి మళ్లీ తీవ్రం కావడంతో, మ్యాచ్‌ను అర్ధాంతరంగా ఆపేసి వారు టోర్నీ నుంచి తప్పుకున్నారు. ఈ తాజా గాయం వల్ల వచ్చే వారం జరగబోయే చైనా ఓపెన్‌కు కూడా ఈ జోడీ దూరం కానుంది. వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌నకు సిద్ధం కావడమే లక్ష్యంగా వీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకోనున్నారు.
మరోవైపు, మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు మాత్రం దుమ్మురేపారు. మలేషియా ప్లేయర్ వాంగ్ లింగ్ చింగ్‌పై కేవలం 36 నిమిషాల్లోనే 21-14, 21-11 తేడాతో వరుస గేమ్స్‌లో విజయం సాధించి అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించారు. అలాగే మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జోడీ కూడా స్కాట్లాండ్కు చెందిన అలెగ్జాండర్ డన్, జూలీ మాక్ఫెర్సన్లపై 21-16, 21-14తో తేలికగా గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.
అయితే మిగతా భారత ఆటగాళ్లకు ఈ రౌండ్లో నిరాశే ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్, రుత్విక శివాని గద్దె జోడీ చైనాకు చెందిన టాప్ సీడ్స్ ఫెంగ్ యాన్ జె, హువాంగ్ డాంగ్ పింగ్ చేతిలో 11-21, 10-21తో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో హరిహరన్ అంసకరుణన్, ఎమ్.ఆర్. అర్జున్ జోడీ చైనీస్ తైపీకి చెందిన లీ జె-హుయ్, యాంగ్ పో-హసువాన్లపై రెండో గేమ్ గెలిచి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, చివరికి 13-21, 21-17, 7-21తో పరాజయం పాలైంది.

