కలం, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఉన్న బృందావనం (Vrindavan)లో శుక్రవారం యమునా నదిలో జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. నదిలో పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడి పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బలమైన గాలులతో ఈ పడవ నదిలో ఉన్న ఫ్లోటింగ్ డ్రమ్ములను ఢీకొట్టి నీటిలో మునిగిపోయింది. అయితే బోటులో పరిమితికి మించి ఎక్కువ మంది పర్యాటకులను ఎక్కించుకోవడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో పాటు పర్యాటకుల్లో ఏ ఒక్కరు కూడా లైఫ్ జాకెట్లు ధరించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. లైఫ్ జాకెట్లు ఉండి ఉంటే ఒక్కరు కూడా చనిపోయి ఉండేవారు కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. వీరంతా పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా, ముక్త్‌సర్ ప్రాంతాలకు చెందిన వారని తెలిపారు. పోలీసులు, అధికారులు మృతదేహాలను బృందావన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, వారి బంధువులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 50 మంది గజ ఈతగాళ్లు సహాయక చర్యలు చేపట్టి 17 మందిని రక్షించారు.

