కంబ్యాక్‌లోనే హిస్టరీ క్రియేట్ చేసిన బుమ్రా

క‌లం, వెబ్ డెస్క్‌: జస్ప్రిత్ బుమ్రా (Jasprit Bumrah).. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. కానీ చాలా కాలంగా గాయం వల్ల టీమిండియాకు దూరంగానే ఉంటున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డేలో బుమ్రా కంబ్యాక్ ఇచ్చాడు. తన కంబ్యాక్‌ను ఎంత బలంగా ఇచ్చాడంటే రికార్డ్‌లు బద్దలయ్యాయి. సరికొత్త చరిత్ర ఏర్పడింది. ఏకంగా 968 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన ఆయన, ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ను అవుట్ చేసి వన్డేల్లో 150వ వికెట్ సాధించారు. ఈ వికెట్‌తో ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక వన్డే వికెట్లు తీసిన భారత బౌలర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించారు. అక్కడ ఆడిన 17 వన్డేల్లో 21.41 సగటుతో 31 వికెట్లు పడగొట్టిన బుమ్రా, ఇప్పటివరకు 30 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న రవీంద్ర జడేజాను అధిగమించి టాప్‌లోకి దూసుకెళ్లారు.

భువనేశ్వర్ కుమార్ (28), మదన్ లాల్ (27), మహ్మద్ షమీ (26)లను వెనక్కి నెట్టి ఇంగ్లాండ్ నేలపై తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు ఒక దశలో మిడిలార్డర్ కుప్పకూలడంతో తీవ్ర కష్టాల్లో పడింది. అయితే జో రూట్ ఒకవైపు వికెట్ కాపాడుకుంటూ 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఆయన లియామ్ డాసన్‌తో కలిసి ఏడో వికెట్‌కు 121 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించారు. మరోవైపు భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో కేవలం 62 పరుగులిచ్చి 4 వికెట్లు తీశారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్‌తో బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత అరుదైన ప్రపంచ రికార్డు క్లబ్‌లో చేరిపోయారు.

ప్రపంచవ్యాప్తంగా టెస్టుల్లో 200, వన్డేల్లో 150, టీ20ల్లో 100 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా షకీబ్ అల్ హసన్, టిమ్ సౌథీ సరసన నిలిచారు. ప్రస్తుతం బుమ్రా ఖాతాలో 234 టెస్ట్ వికెట్లు, 150 వన్డే వికెట్లు, 121 టీ20 వికెట్లు ఉన్నాయి. అంతేకాకుండా కేవలం 4,605 బంతుల్లోనే 150 వన్డే వికెట్ల మైలురాయిని అందుకున్నారు. దీనివల్ల అతి తక్కువ బంతుల్లో ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా నిలిచారు.

ఈ రేసులో మహ్మద్ షమీ (4,070 బంతులు), కుల్దీప్ యాదవ్ (4,513 బంతులు) మాత్రమే ఆయన కంటే ముందుండగా, అజిత్ అగార్కర్, ఇర్ఫాన్ పఠాన్‌లను బుమ్రా అధిగమించారు. గతంలో ఇదే ఇంగ్లాండ్ గడ్డపై 2019 వన్డే వరల్డ్ కప్‌లో బుమ్రా 18 వికెట్లు తీసి జట్టును సెమీస్ చేర్చారు. అలాగే 2022 సిరీస్‌లో కేవలం 19 పరుగులకే 6 వికెట్లు తీసి తన కెరీర్ బెస్ట్ ప్రదర్శనను నమోదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>