కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించి, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌లోని న్యూటౌన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(ఉర్దూ)లో మైనారిటీ సంక్షేమ నిధులు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న బహుళ ప్రయోజన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కొత్త భవనంలో అవసరమైన తరగతి గదులు ఏర్పాటు చేయడంతో పాటు, కంప్యూటర్ లెర్నింగ్ సెంటర్, ప్రయోగశాల, భవిష్యత్తులో అదనపు అంతస్తు గ్రంథాలయం వంటి సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు.
న్యూ టౌన్ పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థులు ఐఐఐటీ, ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మంచి మార్కులు సాధించే సామర్థ్యం ఉన్న విద్యార్థులకు అదనపు శిక్షణ అందించి, మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రోత్సహించాలని కోరారు.
ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 170కి పెంచడం సాధారణ విషయం కాదని, దీని వెనుక ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నిరంతర కృషి ఉందని యెన్నం ప్రశంసించారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను కలిసి, తమ పిల్లలను పాఠశాలకు పంపేలా అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యేగా ప్రభుత్వ పాఠశాలలను తరచూ సందర్శిస్తూ, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, కార్పొరేటర్లు షబ్బీర్ అహ్మద్, అవేజ్, ఉమర్ కొత్వాల్, తాహేర్, విట్టల్ రెడ్డి, నాయకులు ఫరూక్ హుసేన్, మోయీజ్, మీర్ షోయెబ్, మహ్మద్ రియాజుద్దీన్ , ఎఎంఓ దుంకుడు శ్రీనివాస్, ఎంఇఓ లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

