కలం, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) భేటీ అయ్యారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పెండింగ్ రైల్వే పనుల (Karimnagar Railway Projects) పురోగతిపై సమీక్షించారు. ఈ మేరకు బండి సంజయ్ కీలక ప్రతిపాదనలు చేయగా.. పలు రైల్వే పనులకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల అప్ గ్రేడేషన్ కు అధికారులు సానుకూలంగా స్పందించారు. నెల రోజుల్లోగా స్టేషన్ల అభివృద్ధిపై నిర్ణయం తీసుకుంటామని వారు స్పస్టసం చేశారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ లో వ్యాగన్ ఓర్ లోడింగ్, అన్లోడింగ్ పాయింట్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు.
కేంద్ర రైల్వే శాఖ కొత్తగా ఏర్పాటు చేస్తున్న కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లేన్ నిర్మాణాన్ని 2028లోగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను బండి సంజయ్ కోరారు. అలాగే ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కొండగట్టు వద్ద రైల్వే స్టేషన్ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని విన్నవించారు. కరీంనగర్ నుండి తిరుపతి వారానికి 3సార్లు రైళ్లను నడపాలని వారికి విన్నవించారు. శబరిమలకు ఈ సీజన్ లో వారానికి రెండు సార్లైనా ప్రత్యేక రైళ్లను నడపాలని బండి సంజయ్ కోరారు.

