కలం, సోన్ : సోన్ మండలంలోని న్యూ వెల్మల్, బొప్పారం గ్రామాల్లో హనుమాన్ పండుగ (Hanuman Festival) వేడుకలను బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి మరుసటి రోజు ఈ వేడుకలను నిర్వహించడం గ్రామాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం హనుమాన్ ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సింధూరంతో అలంకరించారు.
అనంతరం సంప్రదాయబద్ధంగా నిర్వహించిన జారుడు గుంజ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుంజ ఎక్కేందుకు యువకులు పోటీపడగా, గ్రామస్తులను వారిని ఉత్సాహపరిచారు. విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
శ్రీరాంసాగర్ జలాశయం నిర్మాణ సమయంలో ఈ రెండు గ్రామాలు ముంపునకు గురికావడంతో గ్రామస్తులు పునరావాస ప్రాంతాలకు తరలివెళ్లారు. అక్కడ హనుమాన్ ఆలయాలను నిర్మించుకుని, పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి మరుసటి రోజు ఈ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. హనుమాన్ పండుగకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూ వెల్మల్ సర్పంచ్ రాచకొండ సాగర్, బొప్పారం సర్పంచ్ దేశెట్టి నరేష్, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

