చాకలివానిపల్లిలో న్యాయ సేవలపై ఇంటింటి సర్వే

కలం, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో.. కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గన్నేరువరం మండలం చాకలివానిపల్లిలో (Chakalivanipalli) బుధవారం ఇంటింటి క్షేత్రస్థాయి సర్వే ప్రారంభమైంది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన జిల్లా న్యాయమూర్తి యస్. శివకుమార్ అనుమతితో ఈ కార్యక్రమం చేపట్టారు. సర్వే ప్రారంభానికి ముందు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్వే బృందంతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ రేపాక బాణవ్వ, మండల తహసీల్దార్ ఇప్ప నరేందర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ. శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాల సేకరణకు అవసరమైన సహకారం అందిస్తామని వారు తెలిపారు. ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లతో కూడిన బృందాలు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉపాధి, సమస్యలు, న్యాయపరమైన అవసరాలపై సమాచారం సేకరించాయి. ఈ సందర్భంగా మొత్తం 60 కుటుంబాలను సందర్శించారు.

ప్రజలకు ఉచిత న్యాయ సేవలు, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (NALSA) పథకాలు, న్యాయ సహాయం పొందేందుకు ఉన్న అర్హతలు, విధానాలపై అవగాహన కల్పించారు. మహిళలు, బాలలు, వృద్ధులు, దివ్యాంగులు, కార్మికులకు చట్టాలు కల్పిస్తున్న హక్కులు, రక్షణలను వివరించారు. సర్వేలో సేకరించిన వివరాల ఆధారంగా అర్హులకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు, సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కూన సంతోష్, పంచాయతీ కార్యదర్శి ఈ. రాజు, మండల ఆర్‌ఐ రఘు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>