కలం, కరీంనర్: కరీంనగర్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్(Red Cross) సొసైటీ శాఖ వైస్ ప్రెసిడెంట్‌గా జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి నామినేట్ అయ్యారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ సంగెం లక్ష్మణరావు ఆధ్వర్యంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి స్వామిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సహకరించిన జిల్లా అధికారులకు ఛైర్మన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సభ్యత్వ నమోదులో కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ విజయంపై రాష్ట్ర గవర్నర్ జిల్లా రెడ్ క్రాస్ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ప్రోత్సాహం, మార్గదర్శకత్వం, జిల్లా యంత్రాంగం, వివిధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టి కృషితోనే ఈ ఘనత సాధ్యమైందన్నారు.
రక్తదానం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, ఆరోగ్య సేవలు, సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత సేవలందించడమే రెడ్ క్రాస్ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా అధికారుల సహకారంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని సంగెం లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ ఛైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు పెండ్యాల కేశవరెడ్డి, కుందారపు మహేశ్వర్, పెద్ది విద్యాసాగర్, కోల అన్నారెడ్డి, రాగి శ్రీనివాస్, రాజిరెడ్డి, టీజీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి కాళి చరణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

