కలం, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తరచూ ‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం’ అంటూ బహిరంగ వేదికలపై తన ఆలోచన, ఆచరణను పంచుకుంటూ ఉంటారు. అదే సమయంలో ‘కోటి ఓట్లు.. 90 సీట్లు’ అంటూ ఇటీవల వ్యాఖ్యానించారు. కోటి మంది మహిళలకు ప్రభుత్వం దగ్గరైతే ఆటోమేటిక్‌గా కోటి ఓట్లు వస్తాయని, మరోసారి ప్రభుత్వంలోకి రావచ్చన్నది సీఎం ఉద్దేశమని ఆ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతున్నది. వచ్చే నెల 7వ తేదీ నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ఇప్పటి వరకు చేసిన పనులను, వాటి ద్వారా వారికి కలిగిన లబ్ది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న ప్రగతి.. వీటన్నింటిపై సర్కార్ విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటున్నది. ఏయే రూపాల్లో మహిళలకు ఎలాంటి అవకాశాలు లభించాయి? వాటి ద్వారా మహిళా సంఘాలు ఆర్థికంగా ఎలా బలపడ్డాయి? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వారి పాత్ర ఏ మేరకు పెరిగింది.. వీటన్నింటినీ ఉదాహరణలతో సహా వివరించాలని అనుకుంటున్నది.
పథకాలు, ప్రయోజనాలు, ఫలితాలతో క్యాంపెయిన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే బహిరంగ సభల్లో చాలాసార్లు “ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ చీరలతో అక్కా చెల్లెళ్లు పాలపిట్టల్లా కనిపిస్తున్నారు..” అంటూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఈ నెల 26న అచ్చంపేట వేదికగా కోటిమంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీని ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. కొత్తగా 4.76 లక్షల మంది మహిళలకు ‘చేయూత’ పింఛన్ల కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఆ వేదిక ద్వారా మూడేండ్లలో మహిళల కోసం ప్రభుత్వం చేసిన పథకాలను ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నారు. మహిళలను ఆర్థికంగా సుసంపన్నం చేసిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి మహిళా శిశు సంక్షేమ శాఖ రూపొందించిన బుక్‌లెట్‌ను కూడా ఆవిష్కరించే అవకాశమున్నదని ఆ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వానికి ఆర్థికంగా ఏ రూపంలో మహిళా సంఘాలు సహకారం అందిస్తున్నాయి? ఒకప్పుడు ఉపాధి వెతుకులాటలో ఉన్న మహిళలు ఇప్పుడు పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎలా ఎదిగారు.. వీటన్నింటినీ ఆ బుక్‌లెట్‌లో ప్రస్తావించింది.
మూడేండ్లలో మహిళలకు జరిగిన లబ్ధి
మూడేండ్లలో మహిళా సంఘాలకు అందిన లబ్ధి, ఆర్థిక ప్రగతి వివరాలను ప్రభుత్వం రూపొందించిన నివేదికలో పొందుపరిచింది. గడిచిన మూడేండ్లలో మహిళా గ్రూపులకు రూ.79 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందగా, బ్యాంకుల నుంచి పొందే రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ప్రభుత్వ ‘వడ్డీ మాఫీ’ పథకం ద్వారా రూ.1,900 కోట్ల మేర ఊరట లభించగా, సుమారు 5 లక్షల మహిళా బృందాలు లబ్ధి పొందాయి. దాదాపు రూ.11,952 కోట్ల పెట్టుబడితో సుమారు 6.48 లక్షల మంది మహిళలు వ్యాపారంలోకి అడుగుపెట్టగా, ‘అమ్మకు అక్షరం’ కార్యక్రమం ద్వారా 13.80 లక్షల మంది అక్షరాస్యులుగా మారారు.
వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా మహిళలకు చేకూరిన ప్రయోజనాలను కూడా వివరంగా వెల్లడించారు. మహిళా గ్రూపులకు బీమా సౌకర్యాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచగా ఇప్పటివరకు 231 మందికి లబ్ధి చేకూరింది, అలాగే ‘లోన్ బీమా’ ద్వారా 2,993 క్లెయిమ్‌లు పరిష్కారమై రూ.23.72 కోట్ల రుణ లభ్యత కలిగింది. మహిళా సమాఖ్యల కోసం 8 వేల సొంత భవనాల నిర్మాణం చేపట్టగా ఇప్పటివరకు 1,399 భవనాలను ప్రారంభించారు, జిల్లాల్లో 22 జిల్లా సమాఖ్యలకు సొంత భవనాలు నిర్మిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో 230 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయగా ఒక్కో యూనిట్‌కు నెలకు రూ.72 వేల లాభం వస్తున్నది, ప్రతి క్యాంటీన్లో ఐదుగురికి ఉపాధి లభిస్తున్నది. హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన 106 మహిళా స్టాళ్ల ద్వారా ఏడాదిలో రూ.11 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగాయి.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ కుట్టు కూలీని జతకు రూ.50 నుంచి రూ.75కు పెంచగా, రూ.25 లక్షల బ్యాంకు రుణంతో 2,259 మహిళా గ్రూపుల ద్వారా 29,680 మంది మహిళలు టైలర్లుగా మారి 38 లక్షల జతల యూనిఫామ్‌లు కుట్టడం ద్వారా రూ.52 కోట్ల ఆదాయం ఆర్జించారు. ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ కింద విద్యాసంస్థల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించడంతో అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో సగటు అడ్మిషన్లు 111కు పెరిగాయి, రూ.706 కోట్ల మేర మౌలిక సౌకర్యాలు కల్పించారు. ప్రతి జిల్లాలో 2 మెగావాట్ల సామర్థ్యంతో మహిళా బృందాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోగా మధిర, ఆసిఫాబాద్, వికారాబాద్, జనగాం, ఖమ్మం, పెద్దపల్లిలో ప్రారంభమయ్యాయి, ఒక్కో ప్లాంట్‌పై నెలకు రూ.5 లక్షల లాభం వస్తున్నది. ఉచిత ప్రయాణం చేసే మహిళలు వెయ్యి బస్సులకు ఓనర్లుగా మారగా, నెలకు రూ.70 వేల లాభంతో మరో 400 బస్సుల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహిళలే నడుపుతున్న తొలి పెట్రోలు బంకు నారాయణపేట్‌లో ప్రారంభమై తొలి ఆరు నెలల్లోనే రూ.43 లక్షల లాభం ఆర్జించగా, మరో 30 బంకులు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.
నాడు రుణం కోసం పాట్లు.. నేడు వ్యాపారవేత్తలు
ఒకప్పుడు రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిన మహిళలు ఇప్పుడు వ్యాపారవేత్తలుగా రాణిస్తూ రాష్ట్ర ఎకానమీకి దోహదపడుతున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ పేర్కొన్నది. కుటుంబ పోషణకు అవసరమైన డబ్బుల కోసం బతుకుపోరాటం సాగించిన మహిళలు ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఎదిగారని, ఉద్యోగం కోసం తిప్పలుపడినవారు ఇప్పుడు ఉపాధి కల్పిస్తున్నారని వివరించింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా, ఉచిత ప్రయాణం చేసేవారిగా ఉన్న మహిళలు ఇప్పుడు బస్సులకు, పెట్రోలు బంకులకు, సోలార్ పవర్ ప్లాంట్లకు, దుకాణాలకు ఓనర్లుగా మారారని తెలిపింది. గతంలో సగటున రెండు లక్షల రూపాయల రుణం పొందే స్థాయి నుంచి ఇప్పుడు పది లక్షలు పొందే స్థాయికి ఎదిగారని వివరించింది. కుటుంబాల్లో వంటింటి కుందేలు అనే ముద్ర నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు, సిబ్బందికి కడుపు నింపే ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ల నిర్వాహకులుగా మారారని పేర్కొన్నది. పిల్లలను స్కూలుకు పంపే స్థాయి నుంచి లక్షలాది మంది విద్యార్థుల స్కూల్ యూనిఫామ్‌లు కుట్టే టైలర్లుగా మారారని తెలిపింది.

