కలం, నల్లగొండ: శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రాజెక్టు (SLBC Project) సొరంగ మార్గం పనులు పూర్తయితే ఎంతటి కరువు వచ్చినా శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుండి నీటిని తీసుకొని రైతులకు సాగునీరు అందించవచ్చని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ (AMC New Governing)ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవి.. ఏఎంసీ నూతన చైర్మన్‌గా బి. హేమలత వెంకటరెడ్డి, వైస్ చైర్మన్‌గా వి. శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల పదవులు అత్యంత కీలకమైనవని తెలిపారు. రైతులకు సేవ చేసే గొప్ప అవకాశం ఈ పదవుల ద్వారా లభిస్తుందన్నారు.
నూతన పాలకవర్గం రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేయాలని కోరారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నల్గొండ మార్కెట్ కు ఇది రెండవ పాలకవర్గం కావడం సంతోషకరమని పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తుండటం మనందరికీ గర్వకారణమని అన్నారు.
త్వరలోనే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి
జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను నివారించడంతో పాటు సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా రూ.2,000 కోట్లతో చేపట్టిన ఎస్ఎల్బీసీ పనులు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయాయని మంత్రి విమర్శించారు. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చాక ఈ పనులను తిరిగి ప్రారంభించామని, మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆగినప్పటికీ ఇటీవలే పనులను పునఃప్రారంభించి చురుగ్గా కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
అలాగే తమ హయాంలోనే చేపట్టిన బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే 35,000 ఎకరాలకు సాగునీరు అందించామని, త్వరలోనే లక్ష ఎకరాలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఏఎంఆర్పీ కాలువల లైనింగ్ పనులను ₹450 కోట్లతో చేపట్టామని, ముశంపల్లి సబ్ స్టేషన్‌తో పాటు కొత్త రోడ్డును మంజూరు చేయించామని వివరించారు. జిల్లాలో కాలువలు, రిజర్వాయర్లు నిండితే భూగర్భ జలాలు పెరిగి బోర్లు రీఛార్జ్ అవుతాయని తెలిపారు.
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపిన మంత్రి, ఈ సందర్భంగా జిల్లా మరియు రాష్ట్ర ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు.

