కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ తనతో చర్చకు రావాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) డిమాండ్ చేసిన వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సవాల్ విసిరారు. ‘రాహుల్ గాంధీతో చర్చకు మోదీనే రావాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ సమావేశపర్చమని ప్రధానికి ఒక లేఖ రాయండి. ప్రత్యేక సమావేశం పెట్టుకుని.. మీరు కోరుకున్న అంశంపై మేం చర్చిద్దాం. అంతే తప్ప అబద్ధాలు ప్రచారం చేయడం ఆపండి’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
హర్యానాలోని కర్నాల్‌లో జరిగన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘2024 ఎన్నికల్లో దేశ ప్రజలు ఒక్కటై రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఏకపక్షంగా ఓడించారు. అందుకు మొదటగా హర్యానాలోనే బీజం పడింది. కాంగ్రెస్ నాయకుడు హూడా కౌంటింగ్ రోజు కొత్త బట్టలు వేసుకుని, అందరికీ పంచడానికి స్వీట్లు పట్టుకుని వచ్చారు. అయిదో రౌండ్ పూర్తయ్యేసరికి అసలు విషయం తేలిపోయింది. కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది’ అని ఎద్దేవా చేశారు.
ఎన్నికల సంఘాన్ని నిందిస్తారా..?
హర్యానా ఎన్నికల తరువాత మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అయిందని అమిత్ షా (Amit Shah) వివరించారు. మూడు దశాబ్ధాల తరువాత ఢిల్లీలో తమ ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. అసోంలో వరుసగా మూడో సారి గెలిచామని.. ఇక బెంగాల్‌లో మమత పార్టీని తుడిచి పెట్టేశామన్నారను. పుదుచ్చేరిలో కూడా బీజేపీ ప్రభుత్వమే వచ్చిందన్నారు. కానీ రాహుల్ గాంధీకి ఇవేమీ కనిపించడం లేదని.. తమ ఓటమికి ఎంత సేపు ఎన్నికల సంఘాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సర్ ప్రక్రియపై పదే పదే ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ 2014లో సర్ లేకపోయినా తాము ఎలా గెలిచామని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా కొట్టుకుపోయిందని స్పష్టం చేశారు.
Also Read : సీఎం రేవంత్‌కి కల్వకుంట్ల కవిత వార్నింగ్
Follow Us On: X(Twitter)

