రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. జీవిత బీమాపై యెన్నం కీలక ప్రకటన!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఎన్నికల కోసం ఆరాటపడటం కాదు.. భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజల కోసం చేసిన పనులే చరిత్రలో నిలిచిపోతాయని ఆయన పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన 2,240 మంది వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, నేత కార్మికులకు ప్రభుత్వం కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేసింది. సోమవారం శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం పాల్గొని పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగున్నర లక్షల మందికి కొత్తగా పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. పింఛన్ల మంజూరులో ఎలాంటి రాజకీయ వివక్షకు తావులేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తామని స్పష్టం చేశారు. సాంకేతిక కారణాలతో ప్రస్తుతం పింఛన్ మంజూరు కానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తదుపరి విడతల్లో అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.

మహబూబ్‌నగర్ పట్టణంలో సుమారు 62 వేల రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టామని, కొత్తగా మంజూరైన కార్డులను త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని వెల్లడించారు. ఈనెల 19 నుంచి రేషన్ కార్డుదారుల కుటుంబాల్లో పనిచేసే ఒకరికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పట్టణంలో రూ. 603 కోట్ల వ్యయంతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణ పనులు ప్రారంభించామని, రూ.220 కోట్లతో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ఇందులో భాగంగా 14 నీటి ట్యాంకులను నిర్మిస్తున్నామని, అదనంగా 18 మిలియన్ లీటర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా ప్రణాళిక రూపొందించామని వివరించారు. పట్టణంలోని మొత్తం 60 డివిజన్లలో దశలవారీగా భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టి, రానున్న మూడు, నాలుగేళ్లలో పట్టణమంతటికీ ఈ సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ప్రజలు ఐదేళ్లపాటు తమకు బాధ్యత అప్పగించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిరంతరం ప్రజా సంక్షేమం, పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ , డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>