కలం ,మహబూబ్ నగర్ బ్యూరో: ప్రతి గ్రామంలో ఒక్క ఓటు కూడా ఎవరూ నష్టపోకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) బిఎల్ఎలకు పిలుపునిచ్చారు. స్థానిక సుదర్శన్ కన్వెన్షన్ హాల్‌లో మంగళవారం టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై బిఎల్ఎలకు అవగాహన శిక్షణ శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. SIR ప్రక్రియ పేరుతో దేశంలోని కొన్ని రాష్ట్రాలలో లక్షలాది ఓట్లను తొలగించిన ఉదాహరణలు ఉన్నాయని ఆరోపించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను ఉదాహరణగా చూపుతూ, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చే చర్యలను ఆయన ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి కుట్రలు జరిగే అవకాశముందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
మన రాష్ట్రంలో ఒక్క ఓటరు కూడా తన ఓటును కోల్పోకుండా కాపాడటం ప్రతి బిఎల్ఎ బాధ్యత అని స్పష్టం చేశారు. బిఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ, వారు అందించే ఫారాలను ప్రజలచేత సరిగ్గా నింపించి అధికారులకు సమర్పించాల్సిన బాధ్యత బిఎల్ఎ లపైన ఉందన్నారు. ఓటర్లకు ఎల్లప్పుడూ అండగా నిలిచి, వారిలో చైతన్యం కల్పించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతుతో వాటిని తిప్పికొట్టాలని, వలస వెళ్ళిన వారి వివరాలను ఓటర్ లిస్టులో ఉండేటట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే గ్రామ స్థాయిలో ప్రతి ఓటరుని అప్రమత్తం చేయాలని ఆయన (Yennam Srinivas Reddy) సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, దాన్ని కాపాడటం ప్రతి కార్యకర్త ధర్మమని అన్నారు.
అంతకుముందు బిఎల్ఎ శిక్షణ కమిటీ చైర్మన్, పరిగి ఎమ్మెల్యే టి. రాంమోహన్ రెడ్డి బిఎల్ఎలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, బిఎల్ఓలు గ్రామాలకు వచ్చినప్పుడు ఇతర పనులను పక్కన పెట్టి వారితో కలిసి SIR కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. నెలరోజులపాటు గ్రామాలలోనే ఉండి ఓటర్ల వివరాలను సమగ్రంగా సేకరించాలని, ఎలాంటి అలసత్వం వహించినా పార్టీకి, ప్రజలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, టీ పీసీసీ ప్రత్యేక ట్రేనర్ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పసుల రాజు, డిసిసి ప్రధాన కార్యదర్శులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, సాయిబాబా, రాములు యాదవ్, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ సెల్ చైర్మన్ ఫయాజ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవేజ్, కార్పొరేటర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: దేశానికి ఎల్ నినో టెర్రర్.. లోటు వర్షపాతం!
Follow Us On: Sharechat

