కాంగ్రెస్ సర్కారులో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు: విజయరమణారావు

కలం, పెద్దపెల్లి: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే (Peddapalli MLA) చింతకుంట విజయరమణారావు (Chinthakunta Vijayaramana Rao) తెలిపారు.

హరే రామ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గం, కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని” విప్ విజయరమణారావు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.

​వారానికి ఆరు రోజులు నాణ్యమైన అల్పాహారం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఉదయమే పనులకు వెళ్తుండటంతో పిల్లల పోషకాహారం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు వారానికి 6 రోజుల పాటు నాణ్యమైన అల్పాహారం (ఇడ్లీ సాంబార్, పూరీ ఆలుకుర్మ, దోస, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, బోండా) పాలు అందించే కార్యక్రమాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. కులమత బేధాలు లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులందరూ ఒకే చోట చదువుకునేలా పెద్దపల్లిలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం వేగంగా జరుగుతోందని, ఏడాదిలో ఇది అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలకు రూ.65 కోట్లతో అభివృద్ధి

గత రెండున్నర ఏళ్లలో నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కాంపౌండ్ వాల్స్, కొత్త భవనాలు, టాయిలెట్లు, ఆధునీకరణ పనుల కోసం రూ. 65 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలలను వీడి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతుండటమే సర్కారు విద్యా ప్రమాణాలకు నిదర్శనమని అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మోడల్, కస్తూర్బా పాఠశాలలకు రూ. 2.5 కోట్లు మంజూరు కాగా, రూ. 30 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు.

ప్రభుత్వ విద్యపై పెరుగుతున్న నమ్మకం

ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల ఆకలి బాధలు తీర్చి, నాణ్యమైన విద్యనందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్లు, మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ, మండల పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>