కలం, నల్లగొండ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) పేర్కొన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన చేనేత రుణమాఫీ, ‘నేతన్న భద్రత’ పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు ₹19 కోట్ల మేర చేనేత కార్మికులకు రుణమాఫీ అమలు చేశామని వెల్లడించారు.
కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కొత్తగా ‘నేతన్న భద్రత’ (Nethanna Bhadratha) పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో చేనేత కార్మికుల సమస్యలను విస్మరించారని విమర్శిస్తూ, అప్పట్లో సంక్షేమం కేవలం కాగితాలకే పరిమితమైందని అన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం చేనేత రంగాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తోందని స్పష్టం చేసిన వీరేశం (Vemula Veeresham), భువనగిరి ప్రాంతంలోని ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Read Also: జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్
Follow Us On: X(Twitter)

