కలం, నకిరేకల్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ నకిరేకల్‌ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) పిలుపునిచ్చారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో నియోజకవర్గ స్థాయి విస్తృత అభివృద్ధి సమీక్ష నిర్వహించారు. విప్ వీరేశం మాట్లాడుతూ.. అధికారులు ప్రభుత్వ ఆదేశాలను ఛాలెంజ్‌గా తీసుకుని క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేయాలన్నారు. అవసరమైన నిధులను మంజూరు చేయించే బాధ్యత తనదని, అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని సూచించారు.
రామన్నపేట–అమ్మనబోలు రోడ్డుతో పాటు గుంతలమయమైన గ్రామీణ రహదారుల మరమ్మతులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాని వేముల వీరేశం సూచించారు. అంగన్‌వాడీ, గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. భూగర్భ జలాలు తక్కువగా ఉన్న గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా బల్క్ నీటి సరఫరా పెంచాలన్నారు. సబ్‌స్టేషన్ల భూసేకరణ, పెండింగ్ విద్యుత్ కనెక్షన్లు తక్షణమే మంజూరు చేయాలన్నారు.
నకిరేకల్‌కు జేఎన్‌టీయూ క్యాంపస్..
నకిరేకల్‌కు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు విప్ వేముల వీరేశం అన్నారు. అందుకోసం 90 ఎకరాల భూమిని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బొల్లారంలోని 300 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాలని సూచించారు. చెరువుగట్టు, ఐటిపాముల ప్రాంతాల్లో గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి పెట్రోలింగ్ పెంచాలని డీఎస్పీకి స్పష్టం చేశారు. నూతన 100 పడకల ఆసుపత్రి అభివృద్ధికి అంచనాలు రూపొందించాలని, బస్టాండ్, పోలీస్ స్టేషన్ల మార్పు అనుమతులు తక్షణమే మంజూరు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రజిత శ్రీనివాస్, చిట్యాల మున్సిపల్ ఛైర్మన్ పందిరి శ్వేత, నకిరేకల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మంజుల, సింగిల్ విండో ఛైర్మన్లు, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

