కలం, వెబ్ డెస్క్: ఆన్‌లైన్ రుణ వేధింపులకు అమాయకుల ప్రాణాలు బలి అవుతూనే ఉన్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయి కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. మరికొందరు యాప్ నిర్వహకుల వేధింపులతో (Online Loan App) ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకులు బెదిరించడంతో కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ముడావత్ శ్రీను (31) మహేశ్వరం మండలం హర్షగూడలో నివసిస్తున్నాడు.
నాలుగు నెలల క్రితం శ్రీను ఓ ఆన్ లైన్ లోన్ యాప్ ద్వారా రూ.40 వేల రుణం తీసుకున్నాడు. అప్పు సకాలంలో చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు వేధింపులకు (Online Loan App) గురిచేశారు. దీపావళికి ఇంటికి వెళ్లిన శ్రీనుకు గంటకోసారి ఫోన్లు చేసి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అంతటితో ఆగకుండా డబ్బులు చెల్లించకపోతే శ్రీనుతో పాటు ఆయన భార్య నగ్న చిత్రాలను కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు పంపిస్తామంటూ హెచ్చరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కానిస్టేబుల్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

