కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) శుక్రవారం ప్రారంభించారు. స్థానిక బుధవార్‌పేట్‌లోని నంబర్ వన్ వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్రకు(Ganesh Shobhayatra) శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జన శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు, నిర్వాహకులకు సహకరించాలని కోరారు.
అనంతరం శోభాయాత్రలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డీజే పాటలకు తీన్మార్ స్టెప్పులు వేసి సందడి చేశారు. ఎమ్మెల్యే ఉత్సాహంగా నృత్యం చేయడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైతం డ్యాన్స్‌లు చేస్తూ శోభాయాత్రను కొనసాగించారు.

