కలం, నిజామాబాద్ బ్యూరో: నేటి ఆధునిక కాలంలో చిన్నారులు, యువత స్మార్ట్ఫోన్ల స్క్రీన్లకు, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఎదిగేందుకు రోజుకు కనీసం ఒక గంట పాటు క్రీడా మైదానాలకు పంపాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల పరిధిలోని బషీరాబాద్ (Basheerabad) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన 70వ అండర్-14, అండర్-17 (బాలబాలికల) మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) క్రీడా పోటీలను సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల మార్చ్ ఫాస్ట్, సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి వారిని అభినందించారు. మార్చ్ ఫాస్ట్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన పాఠశాలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు చదువు, విజ్ఞానం ఎంత కీలకమో, వారి శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వానికి ఆటలు కూడా అంతే ప్రధానమని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో క్రీడా సంస్కృతిని విస్తరింపజేయాలన్నదే తన ఆకాంక్ష అని, అందువల్లే నియోజకవర్గవ్యాప్తంగా క్రీడా పోటీల నిర్వహణను నిరంతరం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం చదువులకే పరిమితం చేయకుండా, స్థానిక పాఠశాల మైదానాలకు పంపి వారికి ఇష్టమైన ఆటలను ఆడుకునేలా స్వేచ్ఛనివ్వాలని సూచించారు. ఓడిపోయిన క్రీడాకారులు నిరాశ చెందకుండా మరింత సాధన చేసి భవిష్యత్తులో గెలుపొందేందుకు పట్టుదల పెంచుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విజయం సాధించిన వారు గర్వానికి లోనుకాకుండా తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లు, ఉపాధ్యాయులు, అధికారులు, గ్రామ పెద్దలు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

