కాంగ్రెస్‌కు సీపీఐ చేయూతనిస్తుందా?

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో మిత్రపక్షమైన సీపీఐ (CPI) సహకారంపై కాంగ్రెస్ పార్టీ (Congress)లో సందిగ్ధత నెలకొన్నది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ సీపీఐ నేతలతో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తమకు రెండు ఎమ్మెల్సీ పదవులతో పాటు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని సీపీఐ నేతలు ఈ సందర్భంగా కోరారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందున, మరో ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై సీఎంతో మాట్లాడుదామని టీపీసీసీ చీఫ్ వారికి సూచించారు. గతంలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి పోటీ చేసిన జర్నలిస్ట్ జయసారధి రెడ్డిని బరిలోకి దింపే అంశంపై సీపీఐలో అంతర్గత చర్చ నడుస్తున్నది.

5న సీఎంతో సీపీఐ నేతల భేటీ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా.. వద్దా.. అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో ఈ నెల 5న సీపీఐ అగ్రనేతలు చర్చించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయడంతో సీపీఐకి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి హామీ ఇస్తారో అనే అంశం ప్రాధాన్యత సంతరించుకున్నది. భేటీ అనంతరమే సీపీఐ (CPI) పోటీపై స్పష్టత రానున్నది.

పోటీకి సిద్ధమవుతున్న సీపీఎం

రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లోనూ పోటీ చేస్తామని సీపీఎం ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానానికి ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేయగా.. హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి స్థానానికి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను బరిలోకి దించేందుకు సీపీఎం ప్రయత్నాలు చేస్తున్నది. తమకు మద్దతు ఇవ్వాలని సీపీఐని కోరుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసిన సీపీఎం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు తెలిపింది. మరో మిత్రపక్షం తెలంగాణ జనసమితి (టీజేఎస్) కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌కు అత్యంత కీలకం

గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో, ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ (Congress) పట్టుదలతో ఉంది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సీపీఐకి ఉన్న పట్టు దృష్ట్యా ఆ పార్టీ మద్దతు కాంగ్రెస్‌కు ఎంతో అవసరం. ఈ రెండు స్థానాల్లో గెలిస్తే ప్రభుత్వంపై ప్రజాదరణకు నిదర్శనంగా నిలుస్తుందని, రాబోయే ఎన్నికలకు కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతుందని కాంగ్రెస్ భావిస్తున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>