కలం, వెబ్ డెస్క్: ఏపీలోని పలు జిల్లాల్లో మురసు ప్రభావంతో రానున్న 3 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ (Murasu Cyclone) వెల్లడించారు. ముఖ్యంగా పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, నెల్లూరు, కడప, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తీవ్ర తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని సూచించారు.
ఇప్పటికే తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్ పరిసరాలతో పాటు విజయవాడ నగరంలో వర్షం దంచికొట్టింది. మిర్యాలగూడ నుంచి గుంటూరు మధ్య ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టుప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాగులు పొంగిపొర్లడంతో గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో ఎక్కడికక్కడ బురద పేరుకుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా ప్రజలు పొంగిపొర్లే వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాలతో వచ్చే ఆకస్మిక వరదలు పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
ముఖ్యంగా దక్షిణకోస్తాంధ్రపై మురసు తుపాను (Murasu Cyclone) తీవ్ర ప్రభావం చూపుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 6 కిమీ వేగంతో కదులుతున్నట్లు ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బాపట్లకు 40కిమీ, ఒంగోలుకు 50కిమీ, విజయవాడకు 90 కిమీ, కావలికి 110కిమీ, మచిలీపట్నంకు 120కిమీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. మురుసు క్రమంగా తీవ్రవాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని.. రాత్రి నంచి ఈదురుగాలులు తగ్గే అవకాశం ఉందని చెప్పారు.
Also Read : రోజుల తరబడి ఆందోళన చేస్తారా?: సుప్రీం కోర్టు
Follow Us On : WhatsApp

