కలం, తెలంగాణ బ్యూరో : మనం ఒక్క నెల కరెంటు బిల్లు కట్టకపోతే విద్యుత్ సిబ్బంది ఏం చేస్తారు?.. అనుమానమే అక్కర్లేదు.. నిర్దాక్షిణ్యంగా కరెంటు సప్లై డిస్కనెక్ట్ చేసేస్తారు. పెనాల్టీతో సహా కట్టిన తర్వాతనే తిరిగి సప్లై అందుతుంది. కానీ సచివాలయం (Telangana Secretariat) మాత్రం రెండేండ్ల నుంచి కరెంటు బిల్లు కట్టడంలేదు. సగటున ప్రతి నెలా సుమారు రూ. 70 లక్షల చొప్పున విద్యుత్ వినియోగమవుతున్నది. యావరేజ్‌గా నెలకు దాదాపు ఐదు లక్షల (4.88 లక్షలు) యూనిట్ల మేర కరెంటు వాడకం అవుతున్నది.
ఒక్కో యూనిట్‌కు సరాసరి రూ.8.80 చొప్పున టారిఫ్ ఫిక్స్ అయింది. ఆ ప్రకారం సెప్టెంబరు నెలకు 4,87,565 యూనిట్లను వాడగా రూ. 42,90,572 బిల్లు జెనరేట్ అయింది. డిమాండ్ ఛార్జీలు, టీవోడీ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఏసీడీ సర్‌చార్జి, లేట్ పేమెంట్ ఫీజు.. ఇలాంటివన్నీ కలుపుకుని సెప్టెంబరు నెలకు రూ. 69,44,865 అయింది. ఈ బిల్లు పేమెంట్‌కు అక్టోబరు 15 లాస్ట్ డేట్. పెనాల్టీతో కలిపి అక్టోబరు 30 వరకు కట్టాలి. లేనిపక్షంలో కరెంటు కనెక్షన్‌ను డిస్కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నింటినీ దక్షిణ డిస్కం బిల్లులోనే పేర్కొన్నది. కానీ సంబంధిత అధికారులు బిల్లు కట్టలేదు. అయితే పవర్ కనెక్షన్ డిస్‌కనెక్టు కూడా కాలేదు.
అరియర్స్ బిల్లు రూ. 24.66 కోట్లు :
కానీ కట్టం.. వాడడం వరకే తెలుసు.. క్రమం తప్పకుండా ఇన్-టైమ్‌లో కట్టడం అలవాటు లేదు.. అనే తరహాలో దక్షిణ డిస్కం రీడింగ్ తీయడం, సంబంధిత అధికారికి బిల్లును ఇవ్వడం రెగ్యులర్ ప్రాక్టీసుగా మారింది. ప్రతి నెలా కరెంటు వాడకం ఎంత అయిందో మీటర్ రీడింగ్ తీయడం, బిల్లు జెనరేట్ చేయడం, సచివాలయ అధికారులకు ఇవ్వడం దక్షిణ డిస్కం తన బాధ్యతగా కొనసాగిస్తూనే ఉన్నది. బిల్లు పేమెంట్ జరిగిందో లేదో చెక్ చేసుకుని తదుపరి చర్యలు తీసుకోవడం డిస్కంలోని అకౌంట్స్ సెక్షన్, ఆపరేషన్ సెక్షన్లాంటివాటి బాధ్యత.
బిల్లు కట్టినా కట్టకున్నా యధావిధిగా కరెంటు సరఫరా కొనసాగుతూనే ఉంటుంది. వసూలు చేసేవారు, చెల్లించాల్సినవారు ‘చల్తా హై..’ అనే తీరులో వ్యవహరిస్తుండడంతో ప్రతి నెలా బకాయిలు పేరుకుపోతూనే ఉన్నాయి. సెప్టెంబరు నెల బిల్లు జెనరేట్ అయ్యే సమయానికి పాత బకాయిలే రూ. 24,66,48,161. సెప్టెంబరు నెలలో జెనరేట్ అయిన బిల్లు రూ. 69,44,865తో కలిపితే మొత్తం బకాయి రూ. 25,35,93,026కు చేరుకున్నది. మరో పక్క అక్టోబరు నెల బిల్లు రానే వస్తున్నది. కానీ పేమెంట్ మాత్రం షరా మామూలు.. అన్నట్లుగా తయారైంది. సెప్టెంబరు బిల్లే ఇలా ఉంటే సమ్మర్లో బిల్లుల సంగతి సరేసరి.
అధికారులు నిర్లక్ష్యంలో.. డిస్కంలు నష్టాల్లో..
ఏటేటా వార్షిక బడ్జెట్లు అసెంబ్లీలో టేబుల్ అవుతూ ఉంటాయి, ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చుల కింద అన్ని డిపార్టుమెంట్లకు కేటాయింపులూ ఉంటాయి. కానీ కట్టే దగ్గరే అంతులేని నిర్లక్ష్యం. ఒకపక్క డిస్కంలు నష్టాల్లో కూరుకుపోతున్నాయంటూ వాపోయే ఇంధన శాఖ మంత్రి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కూర్చునేది కూడా ఆ సచివాలయంలోనే. నిత్యం లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు వాడుకుంటూ ఉంటారుగానీ వాటికి ఖర్చుచేసిన విద్యుత్‌కు మాత్రం బిల్లులు కట్టకపోవడం సచివాలయం ప్రత్యేకత.
ఒకపక్క విద్యుత్‌ను పొదుపు చేయాలంటూ ముఖ్యమంత్రి మొత్తుకుంటున్నా సాయంత్రం తర్వాత కూడా సచివాలయం (Telangana Secretariat) భవనంలో అలంకరణకు వాడే లైట్లు వెలుగుతూనే ఉంటాయి. కరెంటు వినియోగంపై మంత్రుల మొదలు అధికారుల వరకు ఎవరికీ పట్టదు. బిల్లుల పేమెంట్ విషయంలోనూ అంతే. సామాన్య కుటుంబాల నుంచి ప్రతి నెలా ఠంచన్‌గా ముక్కుపిండి వసూలు చేసే డిస్కం సిబ్బంది సచివాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల విషయంలో లైట్ తీస్కో.. ధోరణినే అవలంబిస్తూ ఉంటారు. అలాంటి ధోరణితోనే సచివాలయం కరెంటు బిల్లు పెండింగ్ పడి ఏకంగా పాతిక కోట్లు దాటింది.
సెక్రెటేరియట్ కరెంటు కహానీ
సెప్టెంబరులో విద్యుత్ వినియోగం : 4,87,565 యూనిట్లు
ఇందుకు జనెరేట్ అయిన బిల్లు : రూ. 42,90,572
ఇతర చార్జీలతో కలిపి ఆ నెలకు : రూ. 69,44,865
గతం నుంచీ పేరుకుపోయిన అరియర్స్ : రూ. 24,66,48,161
మొత్తంగా పెండింగ్‌లో ఉన్న అమౌంట్ : రూ. 25,35,93,026
సెప్టెంబరు బిల్లు కట్టాల్సిన డెడ్‌లైన్ : అక్టోబరు 15, 2026
కట్టకపోతే డిస్కనెక్ట్ చేయాల్సిన తేదీ : అక్టోబరు 30, 2026
Also Read : కాంగ్రెస్‌కు సీపీఐ చేయూతనిస్తుందా?
Follow Us On: X(Twitter)

