రీ సర్వేలో పొరపాట్లకు తావివ్వద్దు.. అధికారులకు కలెక్టర్ ఆదేశం!

కలం, జోగులాంబ గద్వాల: ప్రభుత్వ భూములను కాపాడడంతోపాటు భూ తగాదాలను పరిష్కరించేందుకే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రీ సర్వే పనులు చేయిస్తోందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మానవపాడు మండలం జల్లాపురం (Jallapuram) గ్రామ శివారులో నిర్వహిస్తున్న రీసర్వే పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. నిబంధనలను అనుసరించి సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని, హద్దుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.

రైతుల పొలాల సర్వే విషయంలో పక్క చేను రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇరుపక్షాల సమక్షంలో నిష్పక్షపాతంగా సర్వే చేయాలన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు సర్వేకు సహకరించాలని, ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరారు. లైసెన్స్ సర్వేయర్ల సేవలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.

సమీప పొలాల రైతులు కలెక్టర్‌ను కలవగా వివిధ అంశాలపై మాట్లాడారు. ఎల్ నినో (El Nino) ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నందున రైతులు రబీ సీజన్‌లో ఆరుతడి పంటలపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని రిజర్వాయర్లలో ఉన్న కొద్దిపాటి నీళ్లను వచ్చే వర్షాకాలం వరకు తాగునీటి అవసరాలకు వినియోగించడం జరుగుతుందన్నారు. పంటలకు సాగునీటిని విడుదల చేసే అవకాశం లేదని.. తమ బోరు, బావుల్లో నీటి లభ్యత ఆధారంగా మాత్రమే పంటలు సాగు చేయాలని, ఎలాంటి నీటి వసతులు లేని రైతులు ఏ పంటలు సాగు చేయవద్దన్నారు. ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని, పాడిపై కూడా రైతులు దృష్టి పెడితే మంచి ఆదాయాన్ని పొందవచ్చన్నారు.

సమీపంలోని ఆర్డీఎస్ కాలువను పరిశీలించిన కలెక్టర్ నీళ్లు చాలా తక్కువగా ఉన్నందున రైతులు తుంగభద్ర నీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఉపాధి హామీలో ఒక్కో గ్రామ పంచాయతీలో రూ.1.0 కోటి విలువైన పనులను చేసేందుకు అవకాశం ఉందన్నారు. వీబీజీ రాంజీ (VB G RAM G) పథకంలో జలసిరి కార్యక్రమంలో పంట కుంటలు, ఇంకుడు గుంతలు, తదితర జల సంరక్షణ పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని అధికారులకు సూచించారు.

రైతు కూలీలు వ్యవసాయ పనులు చేయలేకపోతున్నామని నిరుత్సాహ పడకుండా ఉపాధి హామీ పనులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటే లబ్ధి పొందవచ్చన్నారు. ఉపాధి హామీలో కాలువల వెంట పెరిగిన ముళ్ల పొదలను తొలగించడంతోపాటు డిస్ట్రిబ్యూటరీ, ఫీడర్ ఛానల్ కాలువల్లో పూడికతీత పనులు కూడా చేపట్టేందుకు అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఈ పర్యటనలో సర్పంచ్ నందిని, సర్వే ఏడి నూకరాజు, తహశీల్దార్ మన్సూర్ అలీ సిద్ధికి, డిప్యూటీ తహశీల్దార్ రాములు, ఆర్ఐ గురురాజు, సర్వేయర్ ఇలాయత్ తదితరులు ఉన్నారు.

Also Read : రోజుల తరబడి ఆందోళన చేస్తారా?: సుప్రీం కోర్టు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>