ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కొత్త వెసులుబాటు : మేఘా రెడ్డి

కలం, వనపర్తి: ఆర్థిక స్థోమత లేక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించని లబ్ధిదారులు స్వచ్ఛందంగా అంగీకరిస్తే కాంట్రాక్టర్ల ద్వారా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (​Megha Reddy) తెలిపారు. శుక్రవారం వనపర్తి ఐడీవోసీ సమావేశ మందిరంలో ఆర్థిక ఇబ్బందులున్న లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

వనపర్తి నియోజకవర్గంలో తొలి విడతగా 3,500 ఇళ్లు మంజూరు కాగా 3,164 మందికి మంజూరు పత్రాలు అందించామని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. రెండో విడతలో మరో 258 ఇళ్లు మంజూరు కావడంతో మొత్తం 3,422 మంది లబ్ధిదారులకు పత్రాలు అందించామన్నారు. ఇప్పటివరకు 1,040 ఇళ్లు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు.

జిల్లాలో మంజూరు పత్రాలు పొందినప్పటికీ సుమారు 443 మంది ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేదని, వారికి కాంట్రాక్టర్‌ ద్వారా నిర్మించే అవకాశం కల్పిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. లబ్ధిదారుల అంగీకారంతోనే ఈ విధానం అమలవుతుందని స్పష్టం చేశారు. సొంతంగా నిర్మించుకోవాలనుకునే వారు ఆ విధంగానే నిర్మించుకోవచ్చన్నారు.

ఈ రెండు మార్గాల్లోనూ నిర్మాణం చేపట్టకపోతే మంజూరు రద్దయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాంట్రాక్టర్‌ ద్వారా నిర్మించే ఇంటికి లబ్ధిదారు, కాంట్రాక్టర్‌, బ్యాంకు పేర్లతో ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేసి, నిర్మాణ దశలవారీగా ప్రభుత్వం నిధులు జమ చేసి కాంట్రాక్టర్‌కు బదిలీ చేసే విధానం ఉంటుందని ఎమ్మెల్యే వివరించారు. 418 చదరపు అడుగుల విస్తీర్ణంలో హాల్‌, పడకగది, వంటగది, మరుగుదొడ్డి, స్నానాల గదితో ఇల్లు నిర్మిస్తామని, ఒప్పందం చేసుకున్న మూడు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇంటి నిర్మాణం కోసం అవసరానికి మించి అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో పడొద్దని ఎమ్మెల్యే (​Megha Reddy) లబ్ధిదారులకు సూచించారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు త్వరలో ఒకేసారి బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో పీడీ హౌసింగ్‌ విటోబా, వనపర్తి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మాధవి రమేష్‌, వైస్‌ ఛైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, పెబ్బేరు మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Also Read : 60 శాతం మంది ఓటర్లకు నోటీసులు: సుదర్శన్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>