కలం, వెబ్ డెస్క్: మన దైనందిన జీవితంలో స్మార్ట్ ఫోన్ అనేది కేవలం ఎలక్ట్రానిక్ పరికరం మాత్రమే కాదు, అది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఉదయం నిద్ర లేవడానికి అల్లారం పెట్టుకోవడం మొదలుకుని, రాత్రి పడుకునే మందు సమయం చూసుకోవడం వరకు మన ప్రతి అడుగు ఫోన్ తోనే ముడిపడి ఉంది. అయితే చాలా మంది ఫోన్ హ్యాంగ్ అయినప్పుడు లేదా సమస్య వచ్చినప్పుడు మాత్రమే రీస్టార్ట్ చేస్తుంటారు. కానీ, ఫోన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా, వేగంగా, సాఫీగా పనిచేయడానికి క్రమం తప్పకుండా రీస్టార్ట్ చేయడం చాలా అవసరం అని చెబుతున్నారు టెక్ నిపుణులు. అసలు ఫోన్ ను రీస్టార్ట్ ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి (Smartphone Restart Tips) అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చాలా మంది ఫోన్ను గంటల తరబడి ఉపయోగిస్తూనే ఉంటారు. రీల్స్, ఫోన్ కాల్స్, గూగుల్ పే, ఫోన్ పే ఇలా చాలా సందర్భాల్లో ఉపయోగిస్తుంటారు. కానీ అసలు ఫోన్ను ఎన్నిరోజులకు ఒకసారి రీస్టార్ట్ చేయాలి, ఎందుకు చేయాలో చాలా మందికి తెలియదు.
ఫోన్ ఎందుకు రీస్టార్ట్ చేయాలి..
కంప్యూటర్ల మాదిరిగానే స్మార్ట్ ఫోన్లలో కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్లు, నిలిచిపోయే తాత్కాలిక ఫైళ్లు ఫోన్ వేగాన్ని తగ్గిస్తాయి. వాటన్నింటినీ క్లియర్ చేసి, ఫోన్ పనితీరును మెరుగుపరచడానికి రీస్టార్ట్ అనేది ఒక ప్రాథమిక, ముఖ్యమైన అడుగు అని చెబుతున్నారు నిపుణులు.
ఫోన్ను ఎప్పుడు రీస్టార్ట్ చేయాలి
1. వారానికి ఒకసారి
ఫోన్ను వారానికి ఒకసారి రీస్టార్ట్ చేయాలని చెబుతున్నారు. ప్రతి శని లేదా ఆదివారం ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ను ఒకసారి రీస్టార్ట్ చేసుకోవడం అలవాటు చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల వారం మొత్తం పేరుకుపోయిన అనవసర ఫైళ్లు క్లియర్ అవుతాయట.
2. ఫోన్ పనితీరు మందగించినప్పుడు..
కొన్నిసార్టు ఫోన్లో యాప్స్ తొందరగా ఓపెన్ అవ్వవు. ఇలా యాప్స్ ఓపెన్ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నపుడు, స్కీన్ సరిగ్గా రెస్పాండ్ కానప్పుడు ఫోన్ రీస్టార్ట్ చేయాలని చెబుతున్నారు. అంతేకాకుండా ఏదైనా యాప్ పదే పదే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంటే, ఫోన్ రీస్టార్ట్ చేయడం ద్వారా ఆ సమస్య తొలగిపోతుందని చెబుతున్నారు.
3. హార్ట్వేర్ సమస్యలు అనిపించినప్పుడు..
కొన్నిసార్లు ఫోన్ విపరీతంగా వేడెక్కుతుంది. బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే హెవీ ప్రాసెస్ వల్ల ఫోన్ వేడుక్కుతుంది. అలాంటప్పుడు కాసేపు ఆఫ్ చేసి ఆన్ చేయడం వల్ల ప్రాసెసర్ సాధారణ స్థితికి వస్తుందట. అంతేకాకుండా సిగ్నల్ సరిగ్గా లేకపోయినా, బ్లూటూత్ లేదా వైఫై కనెక్ట్ కాకపోయినా రీస్టార్ట్ చేయడం ఒక మంచి పరిష్కారం అని చెబుతున్నారు నిపుణులు.
4. సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినప్పుడు..
మీ ఫోన్లో సిస్టమ్ అప్డేట్ లేదా పెద్ద యాప్ అప్డేట్స్ జరిగినప్పుడు కూడా ఫోన్ రీస్టార్ట్ చేయాలట. కొత్త ఫైల్స్ సిస్టమ్లో సరిగ్గా సెట్ అవ్వడానికి రీస్టార్ట్ చేయడం తప్పనిసరి అని చెబుతున్నారు నిపుణులు.

