కలం, మెదక్ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసిడింగ్స్ ఎందుకు ఇవ్వడం లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. లబ్ధిదారులు, స్ధానిక నాయకులతో కలిసి ఆందోళన నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసిడింగ్స్ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీ చేసిన అనంతరం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ ఎక్కడని స్థానిక ఎంపీడీవో శంకర్‌ను నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్టు ఇవ్వకపోవడంతో అమె ఆగ్రహించారు. తన ఎమ్మెల్యే కోటా కింద ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లను సైతం కేటాయించకుండా.. కావాలనే లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా అడ్డకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల వైఖరికి నిరసనగా సమావేశం జరుగుతున్న రైతువేదిక వద్ద ఎమ్మెల్యే బైఠాయించారు. తర్వాత సంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా హౌసింగ్ పీడీతో ఫోన్లో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసిడింగ్స్ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని చెప్పారు. వెంటనే రాజయకీయాలను పక్కన పెట్టి ప్రొసిడింగ్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

