కలం మెదక్ బ్యూరో: రైతులు పండించిన పొద్దుతిరుగుడు, వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ (BJP) పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ మేరకు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ (Gajwel) వ్యవసాయ మార్కెట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించింది. మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ అధ్వర్యంలో అందోళన చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సరైన సమయంలో పంట కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాల వల్ల గజ్వేల్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని నినాదాలు చేశారు. అనంతరం పొద్దుతిరుగుడు, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మార్కెట్ కమిటీ అధికారులకు వినతిపత్రం అందించారు. రైతులకు వెంటనే న్యాయం చేయకపోతే మరిన్ని నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

