కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకులు కర్రలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు.. ఎంపీ బండి సంజయ్ పై చేసిన విమర్శలపై బీజేపీ నాయకులు ప్రతి విమర్శ చేయకుండా, వారికి సమాధానం చెప్పలేక సహనం కోల్పోయి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై, గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్న బండి సంజయ్ తనను విమర్శిస్తే దాడులు చేయాలని వారి కార్యకర్తలకు ఏమైనా శిక్షణ ఇస్తున్నారా అనేది అనుమానంగా ఉందన్నారు. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ (Karimnagar) ను దాడులతో అల్లర్లు లేపి శాంతియుత వాతావరణం లేకుండా చేయాలనే కుట్ర చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయమని చూడకుండా దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

