కలం, నాగర్ కర్నూల్: పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి (MLA Rajesh Reddy) అన్నారు. నాగర్కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నూతన అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం వైద్యులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల నమ్మకాన్ని పెంచేలా ఆధునిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం, అలసత్వం, బాధ్యతారాహిత్యానికి ఎలాంటి తావు ఉండరాదని హెచ్చరించారు.
గర్భిణీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సిబ్బందిని వివరణ కోరారు. రోగుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయొద్దని హెచ్చరించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో తాడూరు మండల రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో DMHO ఉషా రాణి, RMO రోహిత్, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్, వైస్ చైర్మన్ బాదం రమేశ్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

