కలం, వరంగల్ బ్యూరో: రేషన్ కార్డులపై ప్రధాని మోదీ పెట్టాలని బీజేపీ డిమాండ్ చేయడం అవివేకమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి (Naini Rajender Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు కొత్త రేషన్ కార్డులు అందిస్తూ సంక్షేమాన్ని అమలు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులపై ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని కోరుతున్న బీజేపీ నేతలు.. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నులపై ఎవరి ఫొటోలు పెడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులు, పెన్షన్లు సక్రమంగా అందించని వారు ఇప్పుడు విమర్శలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రతినిధుల ఫొటోలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పదేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలపై సమాధానం చెప్పాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు.

