కలం, వెబ్ డెస్క్ : తిరుమలలో (Tirumala ) శ్రీవారి దర్శనం కోసం వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం తమిళ పెరటాసి మాసం కొనసాగుతుండటంతో పాటు రాబోయే రోజుల్లో వరుస సెలవులు ఉండటంతో తిరుమలకు వచ్చేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1, అక్టోబర్ 5 తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది.
ఈ మేరకు అక్టోబర్ 1న దర్శనం కోసం రేపు అక్టోబర్ 5న దర్శనం కోసం అక్టోబర్ 4వ తేదీన ఎటువంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే ఈ రద్దు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం తిరుమలలో ప్రతిరోజూ దాదాపు 80 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటుండగా, అదనంగా మరో 30 వేల మంది దర్శనం కోసం తర్వాతి రోజు వరకు వేచి ఉండాల్సి వస్తోందని టీటీడీ తెలిపింది. సాధారణ భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం నిరీక్షించకుండా వారికి త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. భక్తులందరూ ఈ మార్పులను గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు.

