కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి అడ్వాన్స్ ఫీజు రీయింబర్స్ మెంట్ (Fee Reimbursement) చెల్లించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న నెల రోజుల లోపే ఖాతాల్లో నగదు జమ అవుతుందని చెప్పారు. ఇందులో భాగంగా రూ.2,400 కోట్లు ముందుగానే విద్యార్థులకు అందించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.250 కోట్లను బ్యాంకుల్లో జమ చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతుల విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మహనీయుల నుంచి అందరూ స్ఫూర్తి పొందాలనే ఉద్దేశ్యంతో ఫూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 150 ఏళ్ల క్రితమే భార్యను చదివించిన మహనీయుడు జ్యోతీబా ఫూలే అని కొనియాడారు. ఫూలే అనుసరించిన విధానాలనే తమ ప్రభుత్వం అనుసరిస్తున్నదని తెలిపారు. చదువు మాత్రమే పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని సీఎం అన్నారు. అందుకే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఏ విద్యార్థికి కూడా ఫీజు కట్టలేదు, సర్టిఫికెట్లు ఇవ్వము అని కాలేజీలు చెప్పే పరిస్థితి రాదని సీఎం భరోసా ఇచ్చారు. మన విద్యార్థులను విదేశాలకు పంపించి, ఉద్యోగాలు వచ్చేలా చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించి మెడల్స్ సాధించిన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం అన్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న వారికి ప్రపంచం రెడ్ కార్పెడ్ వేస్తుందని తెలిపారు. ఏఐ వల్ల ఐటీ ఉద్యోగాలు పోతున్నాయని, విద్యార్థులు జర్మనీ, జపాన్ భాషలు కూడా నేర్చుకోవాలని సీఎం సూచించారు. జర్మనీ, జపాన్ దేశాల్లో నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా రూ. 2 లక్షల వరకు వేతనాలు ఇస్తున్నారని సీఎం అన్నారు. రాష్ట్రంలో అన్ని కులాల వారు ఒకే చోట చదువుకునేందుకు యంగ్ ఇండియా స్కూల్స్ తీసుకొచ్చామని సీఎం అన్నారు. 119 నియోజకవర్గాల్లో టాటా టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపర్చనున్నట్లు తెలిపారు.
ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణలో కులగణన చేశామని సీఎం తెలిపారు. జనగనణ చేసి బీసీ లెక్కలు తేల్చామని చెప్పారు. సర్వేల్లో ఎక్కడా తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. చివరికి కేంద్రం జనగనణ చేయాల్సిన పరిస్థితి కల్పించామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ 30 ఏళ్లు పోరాడారని, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసి ఆ వర్గానికి న్యాయం చేశామని సీఎం అన్నారు. విద్యా వ్యవస్థలో పోటీతత్వం పెరిగిందని, తెలంగాణ గ్రూప్ 1 ఉద్యోగాల్లో 60 శాతం ఉద్యోగాలు బీసీ అభ్యర్థులకే దక్కాయని తెలిపారు.

