కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఇచ్చిన వివరణపై తాను సంతృప్తి చెందలేని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy) స్పష్టం చేశారు. ఆయన మాట్లాడింది ఒకటైతే, లేఖలో చెప్పింది మరొకటి అని మండిపడ్డారు. ఆయనపై పార్టీ పెద్దలు చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సీనియర్, జూనియర్ అంటూ చిన్నారెడ్డి పార్టీ నేతల మధ్య విబేధాలు కలిగిస్తున్నారని మండిపడ్డారు. తనపై ఆయన చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని మరోసారి వెల్లడించారు.
కాంగ్రెస్ వాదిని అని చెప్పుకునే చిన్నారెడ్డి బీఆర్ఎస్ నేతలతో సాన్నిహిత్యంగా ఉంటున్నారని ఎమ్మెల్యే మేఘారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రయోజనాల కోసమా.. వ్యక్తిగత ఆధిపత్యం కోసమా.. అని ప్రశ్నించారు. చిన్నారెడ్డికి కేబినెట్ హోదాతో ప్రణాళిక సంఘం పదవి ఇచ్చినా.. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. కమిటీ పిలిస్తే వెళ్లి మరోసారి నా వాదన వినిపిస్తామని.. పార్టీ నేతలు నా వెంటే ఉన్నారని పేర్కొన్నారు.
చిన్నారెడ్డి అంశంపై త్వరలోనే నిర్ణయం..
చిన్నారెడ్డి అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. ఇరువురి వాదనలు కమిటీ స్వీకరించిందని.. అధిష్ఠానం కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. కాగా, చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

