ప్రజా చైతన్యం కోసం కళాకారుల కలాలు, గళాలు ఉండాలి: చాడ

కలం, కరీంనగర్: సకల జనుల హితం కోసం, సామాజిక కోణంలో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం కళాకారులు తమ కళాలకు, గళాలకు పనిచెప్పాలని సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkata Reddy) పిలుపునిచ్చారు. కళాకారులు శిక్షణ ద్వారా తమ నైపుణ్యం పెంపొందించుకోవాలని ఆదివారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరాన్ని చాడ వెంకట రెడ్డి ప్రారంభించారు.

ఈ శిక్షణ శిబిరంకు హాజరైన కళాకారులను ఉద్దేశించి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రచయితలు, కవులు, కళాకారులు కార్మిక, కర్షక, ప్రజా సమస్యలపై వారి జీవనవిధానాలపై నిరంతరం అధ్యయనం చేస్తూ రచనలు, పాటలు, వీధి నాటకాలు రాయాలని కోరారు. కళాకారులు ఎంతో మంది ఉంటారు కానీ ప్రజా కళాకారులు కొంత మంది మాత్రమే ఉంటారని, అలాంటి కళాకారులు నిత్యం ప్రజల బాధలను చూసి వాటిని ప్రపంచానికి తెలిజేసేందుకు పాటలు పాడాలన్నారు. కళ అనేది కాసుల కోసం కాదు.. ప్రజల కోసమని పాడే కళాకారులే ప్రజానాట్య మండలి కళాకారులని కొనియాడారు.

ఎంతో మందిని మెప్పించే బలమైన ఆయుధం పాట

అలాంటి కళాకారులు నిత్య విద్యార్థులుగా ఎన్నో విషయాలు తెలుసుకొని, పాటలు నేర్చుకొని పాడాలని.. అందుకు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఉపయోగపడతాయని వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రజల కష్టసుఖాలను పాటల రూపంలో బయటకు తెచ్చి ఎంతో మందిని మెప్పించే అత్యంత బలమైన ఆయుధం పాట అని అన్నారు. ఏ పోరాటాలు, ఉద్యమాలు, బహిరంగ సభలు విజయవంతం కావాలన్నా కళాకారులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కరీంనగర్ లో సెప్టెంబర్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల విజయవంతం కోసం కళాకారులు తమ వంతుగా కళారూపాలు ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.

ఈ శిక్షణా శిబిరం కార్యక్రమంలో సీపీఐ కరీంనగర్,పెద్దపల్లి జిల్లాల కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, తాండ్ర సదానందం, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమిద్ద శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవ్వంపల్లి స్వామి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కటిక రెడ్డి బుచన్న యాదవ్, టేకుమల్ల సమ్మయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ, ఉప్పలయ్య, సహాయ కార్యదర్శి రేగుంట చంద్ర శేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణేష్, వెంకటాచారి, రోంటాల శ్యామ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుడ్డేల సమ్మయ్య, వరకోలు సదానందం, ఎజ్జ రాజయ్య, లక్ష్మీరాజం, ఆసాల రమ, ఇందిరా, లక్ష్మణ్, ఎర్రోజు శ్రీనివాస్, మోహన్, డప్పురాజు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>