కలం, ఖమ్మం బ్యూరో: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క (Vimalakka) ప్రజా సాంస్కృతిక ప్రస్థానం 50 ఏళ్లకు చేరుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ‘ప్రజా కళా జాతర’ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 26 ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా 50 గంటలపాటు ఆట, పాట, మాటలతో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు సోమవారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విమలక్క కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాల నుంచే విప్లవకారులు, ప్రజా కళాకారులు ఉద్భవిస్తారని పేర్కొన్నారు. తన జీవితకాలంలో విప్లవ ప్రజా సాంస్కృతిక ఉద్యమంలో 50 ఏళ్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఈ 50 గంటల ఏకధాటి జాతరను తలపెట్టినట్లు తెలిపారు. మనువాద, సామ్రాజ్యవాద సంస్కృతుల దాడికి ప్రత్యామ్నాయంగా ప్రజా సంస్కృతిని నిర్మించడమే ఈ జాతర లక్ష్యమన్నారు. ఇందులో భాగస్వాములు కావాలని సాంస్కృతిక శక్తులను, ప్రజా సంఘాలను పిలిచారు.
1974 ఆగస్టులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆవిర్భవించిన నాటి నుంచి బాల గాయనిగా ప్రయాణం ప్రారంభించిన విమలక్క అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. జైలు జీవితాన్ని తట్టుకుని నిలబడ్డారని ప్రతినిధులు గుర్తుచేశారు. ఈ కళా జాతరలో ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మల్సూర్, ప్రధాన కార్యదర్శి పోతుల రమేశ్ పాల్గొన్నారు.

