Mobile Popup Ad
Mobile Popup Ad

ఆసుపత్రుల దోపిడీపై విచారణ జరపాల‌ని కలెక్టర్‌కు ఎమ్మెల్యే మేడిప‌ల్లి లేఖ

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పట్టణంలో ఎటువంటి అనుభవం లేకుండా విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం (Medipally Sathyam) గురువారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు లేఖ‌ రాశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ… కరీంనగర్‌లో చాలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు అత్యంత దయనీయంగా ఉన్నాయ‌న్నారు. ధనవంతులు పూర్తిగా వ్యాపార ధోరణితో కుమ్మక్కై ఆసుపత్రులు పెడుతున్నార‌ని ఆరోపించారు. అర్హత లేని డాక్టర్లు, సిబ్బందిని తక్కువ జీతాలకు పెట్టుకొని వారితో శస్త్రచికిత్సలు చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “లిఫ్టులు, వీల్‌చైర్లు, బెడ్లు వంటి అత్యవసర సౌకర్యాలు లేవ‌ని, వీటిపై పర్యవేక్షణ అవసర‌మ‌ని చెప్పారు. సరైన పారిశుద్ధ్యం లేక రోగులు నరకం చూస్తున్నార‌ని తెలిపారు.

చిన్న జ్వరం వచ్చి చికిత్స కోసం డాక్టర్‌ను సంప్రదిస్తే అనవసర పరీక్షలు రాసి లక్షల్లో బిల్లులు వేసి దోచుకుంటున్నార‌న్నారు. ఇది ప్రజారోగ్యంతో వ్యాపారం చేయడమేన‌ని ఆరోపించారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వెంటనే జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను లేఖలో కోరినట్లు తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమ‌న్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని సహించేది లేద‌ని, ప్రజల ప్రాణాలతో ఆటలాడే ఆసుపత్రులపై ఉక్కుపాదం మోపాల్సిందేన‌ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>