కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని ప్రసిద్ధ గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో నిర్మించిన మూడు రాజగోపురాల ప్రారంభోత్సవాన్ని ఆగస్టు 16న నిర్వహించనున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (MLA Mahipal Reddy) తెలిపారు. అదే రోజు ఆలయ శిఖర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆలయ అభివృద్ధి పనులపై ఆలయ పాలకవర్గం, ప్రజాప్రతినిధులు, ధర్మకర్తలు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ.1.50 కోట్ల సొంత నిధులతో ఆలయానికి నాలుగు వైపులా నిర్మిస్తున్న రాజగోపురాల పనులు పూర్తయ్యాయని తెలిపారు.
అయితే ఆలయంలో కొనసాగుతున్న సాలహారం నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులలో వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలయ పురోహితులు, పాలకవర్గం సూచనల మేరకు ప్రారంభోత్సవ తేదీని నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని, దేవాలయానికి అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

