కలం, వెబ్ డెస్క్: బీజేపీ నిర్ణయాలు ఢిల్లీ కేంద్రంగానే జరుగుతుంటాయని, క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోనందునే తమిళనాడులో విఫలమవుతోందని ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై (Annamalai) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి గుజరాత్ డెవలప్‌మెంట్ మోడల్ పాలన అందిస్తామంటే అది సాధ్యమయ్యే పని కాదని విమర్శలు గుప్పించారు. అదే సమయంలో విజయ్ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో.. ఇప్పుడే విమర్శలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు.
విజయ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి, మొదటిసారి సీఎం అయ్యారని.. ఒక మార్పు తెచ్చారని ప్రశంసించారు. కొన్ని దశాబ్దాలుగా నేతలపై కాళ్లపై పడటం, యూనిఫాంలు ధరించడం, చివరికి కర్చీఫ్ కూడా యూనిఫాం రంగులోనే ఉండాలన్న మూస విధానాలతో తమిళనాడు రాజకీయాలే భ్రష్టు పట్టి పోయాయని దుయ్యబట్టారు. విజయ్ రాకతో కొంత మార్పు వచ్చిందని భావిస్తున్నట్లు వివరించారు.
వారసత్వ రాజకీయాలు ఇక చెల్లవు..
తమిళనాడు రాజకీయాలు క్రమంగా మార్పులకు లోనవుతున్నాయని అన్నామలై విశ్లేషించారు. ద్రవిడ సిద్ధాంతం పేరిట పార్టీలు నడిపిస్తూ.. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించేవారికి భవిష్యత్తు ఉండదని డీఎంకేని ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. జనాలపై బలవంతంగా నాయకుడిని రుద్దితే ఒప్పుకోరని, క్షేత్ర స్థాయిలో చాలా మారిపోయిందన్నారు. ఇదిలా ఉంటే, బీజేపీకి గుడ్ బై చెప్పిన అన్నామలై ‘వి ది లీడర్స్ ఫౌండేషన్’ స్థాపించి యువతరం రాజకీయాల్లోకి రావాలంటూ ఉద్యమం చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న అన్నామలై.. వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీ స్థాపించి పోటీ చేస్తారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

