కలం, ఖమ్మం బ్యూరో: వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, అధికారులు సత్వరమే స్పందించి పరిష్కారానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) ఆదేశించారు. శనివారం స్థానిక సింగరేణి అతిథిగృహంలో మిషన్ భగీరథ, కొత్తగూడెం కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా బోర్ల మరమ్మతులు ఉంటే తక్షణమే పూర్తి చేయాలని, అవసరమైన చోట కొత్త బోర్లు వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
నీటి సరఫరాలో అంతరాయం కలిగించే పైప్‌లైన్ లీకేజీలను యుద్ధప్రాతిపదికన అరికట్టాలని, కొత్త పైప్‌లైన్ల ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు. కొనసాగుతున్న నీటి పథకాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. మిషన్ భగీరథ నీరు ప్రతి చివరి ఇంటికీ అందేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాలని, నీటి సమస్యపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాగునీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన (MLA Kunamneni) హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Also: ఐపీఎల్ చరిత్రలో సంచలనం.. 264 లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్
Follow Us On: Instagram

