ప్రజా దర్బార్ లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: ప్రజా దర్బార్‌లో వచ్చిన ప్రతి న్యాయబద్ధమైన సమస్యను గరిష్టంగా మూడు నెలలలోపు పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) తెలిపారు. శనివారం ఖమ్మం జిల్లా (Khammam) తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో సిపి సునీల్ దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి మంత్రి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి భద్రత, భరోసా కల్పించడమే అజెండాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. అభివృద్ధిని ఎక్కడా చిన్న చూపు చూడకుండా పెండింగ్ పనులను పూర్తి చేస్తూ గత ప్రభుత్వం అమలు చేసిన మంచి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పేద ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ల లోనే అధికారులను ప్రజల వద్దకు పంపి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించి సంక్షేమ కార్యక్రమాలు అందించామన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి వారం ఒక శాఖ ఆధ్వర్యంలో గ్రామాల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు మేలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ప్రతి మండలం మూడు క్లస్టర్లుగా విభజన

పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్ పరిధిలోనీ గ్రామ పంచాయతీలలో ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. నేలకొండపల్లి మండలంలో వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 55 శాతం ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చినవేనని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మాణ పురోగతి ఆధారంగా నిధులు విడుదల చేయడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. మే నెలలో రెండవ విడత, తదుపరి విడతల్లో కూడా అర్హులైన పేదలకు ఇండ్లు అందిస్తామని తెలిపారు. ధరణి కారణంగా ఏర్పడిన భూ సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరించే ప్రయత్నం జరుగు తోందని, సాదా బైనమా దరఖాస్తులను కూడా త్వరలో పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.

క్రమపద్ధతిలో దరఖాస్తుల పరిష్కారం

ఆసరా పెన్షన్, రేషన్ కార్డులు, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలపై వచ్చిన దరఖాస్తులను క్రమపద్ధతిలో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలు తొందరపడకుండా ప్రశాంతంగా దరఖాస్తులు సమర్పించాలని, ప్రతి ఒక్కరి దరఖాస్తును స్వీకరించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. సుబ్లేడు గ్రామానికి నూతన పోలీస్ స్టేషన్ మంజూరుకు ప్రభుత్వ అనుమతి తీసుకొని త్వరలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు.

అనంతరం ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ.. ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ముఖ్యమైన కార్యక్రమమని తెలిపారు. అన్ని శాఖల అధికారులు ప్రజల వద్దకే వచ్చి సమస్యలు స్వీకరిస్తున్నారన్నారు. కొన్ని సమస్యలు వెంటనే, మరి కొన్ని కొంత సమయం తీసుకున్నప్పటికీ ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ.. ఉదయం నేలకొండపల్లి మండలంలో ప్రజా దర్బార్ విజయవంతంగా నిర్వహించామని, ప్రస్తుతం తిరుమలాయ పాలెం మండలంలో కొనసాగుతోందని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారం మంచి పరిపాలనకు సూచిక అని పేర్కొన్నారు. ప్రతి అర్జీపై ఫాలోఅప్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్, ఎంపీడీఓ, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>